దామోదరం సంజీవయ్యకు గుర్తింపు కోసం జనసేన ఓ ఉద్యమమే చేస్తోంది. తాజాగా నేతాజీ విషయంలోనూ అలాంటి స్ట్రాటజీనే జనసేన పాటిస్తోంది. నేతాజీపై రాసిన ప్రత్యేక పుస్తకం ఆవిష్కరణకు పవన్ కల్యాణ స్వయంగా హాజరయ్యారు. ఆ పుస్తకానికి పవన్ కల్యాణ్ లెర్నింగ్ సెంటరే సాయం చేసింది. నేతాజీ విషయంలో పాలకులు వ్యవహరిస్తున్న తీరుపై పవన్ అసహనం వ్యక్తం చేశారు. టోక్యోలోని రెంకోజీ ఆలయంలో ఉన్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ అస్థికలను భారత్‌కు తీసుకురాలేకపోతున్నారని పవన్ అసహనం వ్యక్తం చేశారు. 0నేతాజీ అస్థికలను తెచ్చి ఎర్రకోటలో ఉంచాలని పవన్ కోరుతున్నారు.
ఆస్థికలను తెచ్చేంత వరకూ ప్రజా ఉద్యమాన్ని నిర్మించాలన్నారు. ఇది సాధ్యం కావాలి అంటే అందుకు నాయకులపై ఒత్తిడి తీసుకురావాల్సిందేనన్నారు. నేతాజీ అస్థికలు తేవాలని డిమాండ్ చేస్తూ రింకోజ్ టు రెడ్ ఫోర్ట్ అనే హ్యాష్ ట్యాగ్‌ను ఆవిష్కరించారు. నేతాజీ సేవలను ఈ దేశం సరిగా గుర్తించలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. నిన్నకాక మొన్న వచ్చిన వారికి విగ్రహాలు పెడుతున్నామని కనీసం వంద రూపాయల నోటుపైన అయినా నేతాజీ బొమ్మ ఉండేలా ముద్రించాలని ఆయన డిమాండ్ చేశారు. దేశం కోసం ప్రాణాలర్పించిన మహోన్నత వ్యక్తులను స్మరించుకోకుంటే ఈ దేశంలో మనకు ఉండే అర్హతలేదని పవన్ తేల్చేశారు.
రెంకోజీ ఆలయంలోని విజిటర్స్ పుస్తకంలో ఏదోక రోజు నేతాజీ అస్థికలు భారత్‌కు తీసుకొస్తామని అప్పటి ప్రధాని వాజ్‌పేయి అందులో రాసిన విషయాన్ని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. ప్రజలు కోరుకుంటే ఇది సాధ్యమవుతుందని, ఆ ఉద్యమాన్ని హైదరాబాద్ నుంచే ప్రారంభించాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. నేతాజీ అస్థికలు తెచ్చేందుకు మద్దతు కావాలని ఆయన ప్రజలను కోరారు. పార్టీ పరంగా పవన్ కల్యాణ్ ఈ ఉద్యమం ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి.