ఏపీలో అధికార పార్టీ నేతల నిర్వాకాలపై చిత్ర విచిత్రమైన కేసులు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ తమ స్థలాన్ని కబ్జా చేశారంటూ ఇంటలిజెన్స్ వింగ్‌లో ఎస్పీగా ఉన్న మధు అనే అధికారి నగర పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. తాము ఎన్ని సార్లు చెప్పినా కబ్జా ఆపలేదని చివరి ప్రయత్నంగా కమిషనర్‌కు ఫిర్యాదు చేశానని ఆయన చెబుతున్నారు.
విశాఖ ఎంపీ సత్యనారాయణ బిల్డర్. ఆయనపై చాలా కబ్జా ఆరోపణలు ఉన్నాయి. ఎంవీవీ బిల్డర్స్ పేరుతో వ్యాపారం నిర్వహిస్తూ ఉంటారు. ఆయన పీఎం పాలెం గాయత్రి నగర్లో కొత్త వెంచర్ నిర్మిస్తున్నారు. ఆ వెంచర్‌కు వెళ్లే దారి కోసం రోడ్డు వేశారు. అయితే ఆయన ప్రైవేటు భూమిని ఆక్రమించుకుని కల్వర్టు నిర్మించి మీర రోడ్డు వేశారు. ఆ భూమి ఇంటలిజెన్స్‌లో ఎస్పీగా ఉన్న మధు కుటుంబీకులది . దీంతో వారు ఉన్నత స్థాయిలో ఎంవీవీ సత్యనారాయణకు చెప్పే ప్రయత్నం చేశారు. కానీ వర్కవుట్ కాలేదు.చివరికి పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేయాల్సి వచ్చింది.
అధికార పార్టీనాయకుల తీరు వల్ల ఉన్నతాధికారుల ఆస్తులకే గ్యారంటీ లేకుండా పోయిందని ఇక సామాన్య ప్రజల ఆస్తుల సంగతేమిటని కొంత మంది ప్రశ్నిస్తున్నారు. ఈ అంశంపై ఎంవీవీ సత్యనారాయణ కానీ.. సంబధికులు కానీ పోలీసులు కానీ అధికారికంగా స్పందించలేదు. మీడియాలో హైలెట్ అయ్యే అవకాశం ఉండటంతో వీలైనంత త్వరగా సెటిల్ చేయాలని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.