ఆంధ్రప్రదేశ్ మాజీ ఇంటలిజెన్స్ చీఫ్.. డీజీపీ హోదా ఉన్న ఐపీఎస్ ఆఫీసర్ ఏబీ వెంకటేశ్వరరావు తనకు ఇక నుంచి పూర్తి జీతం ఇవ్వాలని ఏపీ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మకు లేఖ రాశారు. గత రెండేళ్లుగా ఆయన సస్పెన్షన్‌లో ఉన్నారు. తన సస్పెన్షన్ కాలం ముగిసిందని… అందుకే తనకు పూర్తి జీతం ఇవ్వాలని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఇప్పటి వరకూ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అధికారం మేరకు సస్పెన్షన్ విధించారని ఇక ప్రభుత్వానికి అధికారం లేదని ఏబీవీ వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. సస్పెన్షన్‌కు 2022 ఫిబ్రవరి 8తో రెండేళ్లు పూర్తైన కారణంగా.. రూల్ ప్రకారం సస్పెన్షన్ ఆటోమేటిక్‌గా తొలగిపోయినట్టేనన్నారు. సస్పెన్షన్ తొలగినందున తన పూర్తి జీతం వెంటనే ఇవ్వాలని కోరారు.
తన సస్పెన్షన్‌పై పొడిగింపు జనవరి 27తోనే ముగిసిందని వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. రెండేళ్లకు మించి సస్పెన్షన్‌ను కొనసాగించాలంటే.. కేంద్ర హోంశాఖ అనుమతి తప్పనిసరి అన్నారు. గడువులోగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం అనుమతి తీసుకోలేదని వెల్లడించారు. 31.7.2021న చివరిసారిగా తన సస్పెన్షన్‌ను పొడిగిస్తూ ఇచ్చిన.. జీవోను రహస్యంగా ఉంచారని.. తనకు కాపీ కూడా ఇవ్వలేదన్నారు. ఏమైనప్పటికీ ఫిబ్రవరి 8తో తన సస్పెన్షన్ ముగిసినట్టేనని ఏబీ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఇప్పుడు ఏబీ వెంకటేశ్వరరావు విషయంలో ఏపీ ప్రభుత్వం ఏం చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే కొత్తగా సస్పెన్షన్ వేటు వేయడానికి ప్రభుత్వానికి అధికారం లేదు.
ఇప్పటికే ఏబీవీని సర్వీస్ నుంచి డిస్మిస్ చేయాలని ప్రభుత్వం సిఫార్సు చేసింది. అది ప్రస్తుతం డీవోపీటీ లేదా కేంద్ర హోంశాఖ దగ్గర ఉంటుంది. ఇంకాఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఎందుకు డిస్మిస్ చేయాలో రాష్ట్ర ప్రభుత్వం సరైన కారణాలు చెబితే నిర్ణయం తీసుకుంటుంది. అయితే ఇంత వరకూ కొన్ని కీలకమైన పత్రాలను పంపలేదన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఏబీవీని సర్వీస్‌లోకి తీసుకుని జీతం ఇస్తారో లేకపోతే ఈ అంశంపై మళ్లీ ఏబీవీ క్యాట్ లాంటి వాటి చోట పోరాడాలో త్వరలోనే తేలనుంది.