రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ఎక్కడ చూసినా – ‘ఆర్.ఆర్. ఆర్’ మాటలే. అద్భుతమనో, రాజమౌళి మార్క్‌కి తగినట్టుగా లేదనో, మరో గొప్ప సినిమా అనో.. ఎవరికి తోచినట్టు, ఎవరికి నచ్చినట్టు వాళ్లు మాట్లాడుతున్నారు. సినిమా వాళ్లయితే… రాజమౌళి ప్రతిభకు జోహార్లు చెప్పేస్తున్నారు. సుకుమార్ `ఇలాంటి సినిమా మీరు తీయగలరు..మేం చూడగలం అంతే` అంటూ రాజమౌళికీ, మిగిలిన దర్శకులకు ఉన్న తేడా స్పష్టంగా చెప్పేశాడు. మిగిలిన వాళ్లంతా తమ తమ శైలిలో స్పందిస్తూనే ఉన్నారు. అయితే ప్రభాస్ `ఆర్.ఆర్.ఆర్` గురించి ఇప్పటి వరకూ మాట్లాడలేదు. రాజమౌళితో ప్రభాస్ కి ఉన్న అనుబంధం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. `రాజమౌళి వల్లే నేను పాన్ ఇండియా హీరో అయ్యా` అని ప్రభాస్ చాలా సందర్భాల్లో చెప్పాడు. `రాధేశ్యామ్` ప్రమోషన్లకూ రాజమౌళి సాయం పట్టాడు. అందుకే `ఆర్.ఆర్.ఆర్` గురించి ప్రభాస్ ఏం మాట్లాడతాడా? అని అంతా వెయిటింగ్.
నిజానికి ప్రభాస్ ఇప్పటి వరకూ సినిమానే చూడలేదట. అందుకే ప్రభాస్ కోసం ప్రత్యేకంగా స్క్రీనింగ్ ఏర్పాటు చేయాలని రాజమౌళి టీమ్ భావిస్తోంది. ఈ సోమవారం ప్రభాస్ కోసం ప్రత్యేకంగా ఈ సినిమా ప్రదర్శించబోతున్నారని తెలుస్తోంది. ఈ స్క్రీనింగ్ కి ప్రభాస్‌తో పాటుగా, ఎన్టీఆర్, చరణ్‌లు కూడా వస్తారని సమాచారం. అయితే అదెప్పుడు? ఎక్కడ? ఇంకెవరు పాల్గొంటారు? అనే విషయాలపై స్పష్టత రావాల్సివుంది.