ఆంధ్రజ్యోతి అంటేనే పుండు మీద కారం రాసినట్లుగా విరుచుకుపడే ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఇప్పుడు ఆర్కే ఇంటర్యూకు పిలవగానే రెడీ అయిపోయారు. గతంలో వైసీపీ అధినేత జగన్‌కు ఏ మాత్రం తగ్గకుండా ఆంధ్రజ్యోతిని బ్యాన్ చేసేశారు. తమ పార్టీ నేతలెవరూ జ్యోతిని మీడియా సమావేశాలకు పిలువద్దని.. ఆ చానల్ చర్చలకు వెళ్లవద్దని ఆదేశించారు. అదో పెద్ద విషయం అయిపోయింది.
ఆ తర్వాత విషయం తెలిసి అమిత్ షా మండిపడ్డారన్న ప్రచారం కూడా జరిగింది. అయితే సోము వీర్రాజు మాత్రం ఆంధ్రజ్యోతి ఆర్కే విషయంలో ఎలాంటి పాజిటివ్ అభిప్రాయాలు పెట్టుకునే అవకాశం లేదు. ఆయన ఎప్పుడూ బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారంచేస్తూంటారన్న ఫిలింగ్లోనే ఉంటారు. చాలా సార్లు ఆర్కేపై వ్యక్తిగత విమర్శలు కూడా చేశారు. తాను స్వయంగా బ్యాన్ చేసిన మీడియాకి.. సోము వీర్రాజు ఇప్పుడు అదీ కూడా తాను తీవ్రంగా వ్యతిరేకించే ఆర్కేకే ఓపెన్ హార్ట్ ఇంటర్యూ ఇచ్చారు.
అధికారికంగా తాను ప్రకటించిన బ్యాన్‌ను ఎత్తివేస్తున్నట్లుగా చెప్పలేదు కానీ.. ఇంటర్యూకి వెళ్లిపోయారు. రాజకీయ నాయకుడికి ప్రచారం ముఖ్యమే. ఆ విషయం తెలిసి కూడా.. జ్యోతిని బ్యాన్ చేశారు సోము వీర్రాజు. ఆయన ఎంతో గొప్పగా చూసుకునే సాక్షి మీడియా చంద్రబాబుకు వ్యతిరేకంగా చేసిన కామెంట్లను మాత్రమే హైలెట్ చేస్తుంది. మిగతా వారు పట్టించుకోరు. గతంలో జ్యోతినే కాస్త కవరేజీ ఇచ్చింది. దాన్ని చెడగొట్టుకున్నారు. ఇప్పుడు మళ్లీ ఈ ఇంటర్యూ తర్వాతైనా ఆర్కేపై తన అభిప్రాయాన్ని సోము వీర్రాజు మార్చుకుంటారేమో చూడాలి !