ఆర్.ఆర్.ఆర్ చూశాక.. చాలామంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ హర్టయిపోయారు. `మా హీరో పాత్ర తేలిపోయింది.. చరణ్ పాత్ర పెరిగిపోయింది..` అంటూ కంప్లైంట్ చేస్తున్నారు. ఇద్దరు పెద్ద హీరోలు కలిసి ఓ సినిమా చేస్తే, ఇలాంటి కొలతలు, అసంతృప్తులూ… మామూలే. గతంలో ఎన్టీఆర్ – ఏఎన్నార్, ఏఎన్నార్-కృష్ణ, ఎన్టీఆర్ – కృష్ణ, శోభన్ బాబు – కృష్ణ… ఇలాంటి కాంబినేషన్లు వచ్చినప్పుపడు కూడా ఫ్యాన్స్ ఇలానే మాట్లాడుకునేవారు. అందులో తప్పు లేదు. కాకపోతే.. ఈతరం ఎందులోనైనా కాస్త అతి చేస్తుంటుంది కదా? కొన్ని చోట్ల.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆర్.ఆర్.ఆర్ టికెట్లని చింపేసి తమ నిరసన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలోనూ తమ అసంతృప్తి బాహాటంగానే వ్యక్త పరుస్తున్నారు. `నిన్ను నమ్మితే ఇలా చేస్తావా జక్కన్నా.` అంటూ నిలదీస్తున్నారు.
ఏ హీరో అభిమానైనా గమనించాల్సిందేంటంటే.. ఇది కథ. ఆస్తి పంకకాలు కాదు. `నీ వాటా ఇదీ.. నీ వాటా ఇదీ` అని తూకం వేసి పంచడానికి. కథలోంచి పాత్రలు పుట్టుకురావాలి గానీ పాత్రల్లోంచి కథలు కాదు. ఓ చోట.. కొమరం భీమ్ హైలెట్ అయితే, ఇంకోచోట.. అల్లూరి అవుతాడు. అందులో తప్పేముంది? సన్నివేశాల పరంగా, పాత్రల్లో షేడ్స్ పరంగా, ఎమోషన్స్ పరంగా తీసుకొంటే… ఎన్టీఆర్ కంటే, చరణ్ పాత్ర బాగా ఎలివేట్ అయ్యిందేమో..? అలా అయితే తప్పేంటి? అల్లూరి సీతారామరాజుగా చరణ్ ఎలివేషన్ చూసిన వాళ్లకెవరికైనా.. చరణ్ పాత్ర హైలెట్ అయిపోయింది అపిస్తుంది. అది సహజం. నిజానికి అక్కడ చరణ్‌ని చూడకూడదు. అల్లూరిని చూడాలి. అల్లూరి విశ్వరూపం అలా చూశాక.. తెరపై ఎన్ని పాత్రలున్నా తేలిపోతాయి.
ఎన్టీఆర్, చరణ్‌లు కలిసి సినిమా చేస్తారని ఎవరైనా ఊహించారా? సెట్లో, ప్రెస్మీట్లలో, ఇంటర్వ్యూలలో ఇద్దరు హీరోలు… అంత స్నేహంగా ఉంటారని ఎవరైనా కలగన్నారా? ఇదంతా `ఆర్.ఆర్.ఆర్` వల్లే సాధ్యం అయ్యింది కదా? `మేం మంచి స్నేహితులం.. మేం బాగానే ఉంటున్నాం. మీకెందుకు లేని పోని ఈగోలు` అని ఈ ఇద్దరు హీరోలు నెత్తీ నోరూ బాదుకున్నా – ఫ్యాన్స్ మారరా? ఇందుక్కాదూ.. మనకు మల్టీస్టారర్లు రాకుండా పోయింది..? ఇందుక్కాదూ… ఇద్దరు హీరోలు కలసి నటించడానికి భయపడేది..? మల్టీస్టారర్లు రావూ.. రావూ… అంటే ఎందుకొస్తాయి? ఇద్దరు హీరోల్ని బాలెన్స్ చేయడం రాజమౌళికే సాధ్యం కాలేదంటే ఇంకెవ్వరికీ అవ్వదు. కాకపోతే.. ఈ జాడ్యం తెలుగు సినిమాల వరకే. బాలీవుడ్ లో ఎన్ని మల్టీస్టారర్లు వచ్చాయో? ఇంకెన్ని వస్తాయో? అక్కడెప్పుడూ ఇలాంటి హెచ్చుతగ్గులు చూడలేదు.
ఇద్దరు హీరోలు కలిశారు కాబట్టే.. రూ.500 కోట్ల సినిమా తీయగలిగాడు రాజమౌళి.
ఇద్దరు హీరోలు కలిశారు కాబట్టే.. తొలి రోజు వసూళ్లలో ఆల్ ఇండియా రికార్డు సృష్టించింది తెలుగు సినిమా.
ఇద్దరు హీరోలు కలిశారు కాబట్టే… టాలీవుడ్ వైపు బాలీవుడ్ కూడా తొంగి చూసింది.
అది చూడకుండా మా హీరోకి ఎక్కువ, మీ హీరోకి తక్కువ అనుకుంటే… ఫ్యాన్సూ అక్కడే ఆగిపోతారు. సినిమా అక్కడే ఆగిపోతుంది. మన తెలుగు సినిమా కూడా ఇక్కడే ఉండిపోతుంది. హీరోలు మారారు. దర్శకుల ఆలోచన మారింది. ఇక మారాల్సిందల్లా ఫ్యాన్సే!