ప్రజాధనం రూ. 48వేల కోట్లు లెక్క తేలకుండా పోయిన వైనం ఇప్పుడు సంచలనం రేపుతోంది. ప్రజల్లోనూ ఎన్నో అనుమానాలు తలెత్తుతున్న సమయంలో బుగ్గన రాజేంద్రనాథ్ ఆదివారం సాయంత్రం ఆలస్యంగా వివరణ ఇచ్చారు. అవి అసలు వర్జినల్ ఖర్చులు కాదని స్పష్టం చేశారు. ఆర్థిక సంవత్సరం ముగింపు సందర్భంగా చేసిన బుక్ అడ్జస్ట్ మెంట్స్ అని చెప్పుకొచ్చారు. స్పెషల్ బిల్లుల పేరుతో ఖర్చు చేసినట్లుగా కాగ్ స్పష్టంగా చెప్పడంతో బుగ్గన ఈ విషయంపైనా వివరణ ఇచ్చారు . కానీ దానికి తలా తోక లేదు. అసలు స్పెషల్ బిల్లులు అనే హెడ్ లేదని చెప్పుకు వచ్చారు.
అంత వరకూ బాగానే ఉన్నా.. మరే బుక్ అడ్జస్ట్మెంట్ను స్పెషల్ బిల్లుల కింద నమోదు చేశామని అంగీకరించారు. సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో బుక్ అడ్జస్ట్మెంట్ను గుర్తించడానికి స్పెషల్ బిల్లులు అనే పేరు పెట్టామని బుగ్గన చెప్పుకొచ్చారు. ఇలా సీఎఫ్ఎంఎస్ సీఈవోనే చేశారని.. దీనిపై కాగ్‌కు తాము క్లారిటీ ఇచ్చామని చెప్పుకొచ్చారు. తామే సీఎఫ్ఎంస్ సీఈవోకు ఈ మేరకు అధికారం ఇచ్చినట్లుగ ాార్థిక శాఖ కార్యదర్శి లిఖితపూర్వకంగా కాగ్‌కు తెలిపారని బుగ్గన చె్పుకొచ్చారు. మొత్తంగా బుగ్గన చెప్పుకొచ్చిందేమిటంటే ఈ రూ. 48వేల కోట్లలో నగదు లావాదేవీలు జరగలేదంటున్నారు. లావాదేవీలు జరగకుండా.. ఎలా ఇవి పరిగణనలోకి వచ్చాయో… ఆర్థిక నిపుణులకు.. లెక్కల్లో పండిపోయిన వారికే తెలియాలి.
కాగ్ కు అన్ని వివరాలు ఇచ్చామని చెబుతున్నారు కానీ.. కాగ్ రిపోర్టులో మాత్రం సర్టిఫై చేయడానికి నిరాకరించింది. అయితే.. ఎప్పట్లాగే ఈ మొత్తం వ్యవహారాన్ని సీఎఫ్ఎంఎస్ తప్పు.. అని.. అదిచంద్రబాబు తెచ్చారని చెప్పడానికే తాపత్రయ పడ్డారు. ప్రభుత్వ కంగారు చూస్తూంటే.. ప్రభుత్వ లెక్కల్లో ఏదో పెద్ద గూడుపుఠాణి జరుగుతోందన్న అభిప్రాయం బలపడుతోంది. స్వతంత్ర ఆడిటింగ్ జరిగినప్పుడో ప్రభుత్వం పూర్తి వివరాలు బయట పెట్టినప్పుడో ఆ లెక్క తేలుతుంది. అప్పటి వరకూ ప్రభుత్వం చెప్పేది నమ్మాల్సిందే.