తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎంగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత తిరుపతి లాంటి ఆధ్యాత్మిక కేంద్రం తెలంగాణకు ఉండాలనుకున్నారు. ఆ దిశగా యాదాద్రిని రెడీ చేయాలనుకున్నారు. వెంటనే చినజీయర్ స్వామిని సంప్రదించి..అప్పటి వరకూ యాదగిరి గుట్టగా చెప్పుకున్న పేరును యాదాద్రిగా మార్చేసి.. కొత్త ఆలయ నిర్మాణానికి బీజం వేశారు. అప్పటనుంచి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తూ వస్తున్నారు. నిర్మాణాలు సాగుతూ ఉన్నాయి. ఇప్పటికి ఆలయం అద్భుత రీతిలో పూర్తయింది. తిరుమలను తలపించేలా గుట్టను తీర్చిదిద్దేందుకు అహర్నిశలూ శ్రమించారు. నేటి నుండి భక్తుల దర్శనానికి అందుబాటులోకి వస్తుంది.
చరిత్రలో నిలిచి ఉండేలా ఆలయ నిర్మాణం !
ఆగమ శాస్త్ర నియమాలు, శిల్ప కళారీతులు, పర్యాటక సౌందర్యం, విజ్ఞుల అభిప్రాయాలు, ప్రజల మనోభావాలు, భక్తుల సౌకర్యాలు మొదలైన అనేక అంశాలను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి స్వయంగా పదేపదే పర్యటిస్తూ ఆలయ నిర్మాణాన్ని పర్యవేక్షించారు. ఉత్తమ సంస్థలను, నిష్ణాతులను నియోగించారు. థర్డ్ పార్టీ పరీక్షలను ఏర్పాటు చేశారు. ఆలయ నిర్మాణానికి సంబంధించి.. నాణ్యత విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబరచారు. కళారీతుల్లోనూ, నిర్మాణాల్లోనూ, నాణ్యతలోనూ, సౌకర్యాల దృష్ట్యానూ, పర్యాటక కోణంలోనూ ఏ విధంగా చూసినా యాదాద్రి మకుటాయమానంగా రూపుదిద్దుకుందని చెప్పుకోవచ్చు.
తిరుమల తరహాలోనే ఏర్పాట్లు !
యాదాద్రిలో తిరుమల తరహాలోనే ఏర్పాట్లు చేశారు. దేవాలయం చుట్టూ 360 డిగ్రీలు ఎటుతిరిగినా చుట్టూరా దృశ్యం సుందరంగా కనిపిస్తుంది. విష్ణు పుష్కరిణి, ఎనభై అడుగుల ఎత్తు దీపస్తంభం, అద్దాల మండపం, కాటేజీలు వంటివి ఉన్నాయి. మెట్లు ఎక్కలేని వృద్ధులు, వికలాంగులను దృష్టిలో పెట్టుకొని ఎస్కలేటర్లు ఏర్పాటు చేశారు. కొండ క్యూ కాంప్లెక్స్‌లోని మొదటి అంతస్తు నుంచి ప్రసాద విక్రయ కేంద్రం వరకు ఎస్కలేటర్లు నిర్మించారు. లడ్డూల తయారీ, పంపిణీ స్థలానికి సరఫరా వరకు యంత్రాల ద్వారానే సాగుతుంది. రోజుకు యాభై లక్షల లడ్డూలు తయారు చేసే సామర్థ్యం ఏర్పాటు చేశారు.
సామాన్య భక్తులకు పెద్ద పీట !
అత్యంత ప్రముఖులు ఆలయాలు సందర్శించినప్పుడు వారికి వేద ఆశీర్వచనం చేస్తారు. కానీ యాదగిరి లక్ష్మీనరసింహుడి సన్నిధిలో సామాన్యులకు కూడా వేద ఆశీర్వచనం ఏర్పాటుచేశారు. సాధారణ ప్రజలు 516 రూపాయల టికెట్ ధర చెల్లిస్తే వేద ఆశీర్వచనం పొందవచ్చు. ఇప్పుడు శని, ఆది వారాల్లో 30 వేల మంది వరకు వస్తున్నారు. ఆలయం పునఃప్రారంభమైన తరువాత రోజుకు యాభై వేల మంది భక్తులు సందర్శిస్తారని అంచనా. అంటే తెలంగాణ తిరుపతి ఆవిష్కృతమైనట్లే..!