ఉగాది రోజు నుంచి కొత్త జిల్లాల పాలన ప్రారంభించడానికి అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ఉద్యోగుల కేటాయింపు పూర్తయింది కానీ అధికారికంగా ప్రకటించలేదు. ఎవరైనా కోర్టుకు వెళ్తే మొత్తం ప్రక్రియ మీద ప్రభావం పడుతుందని…అధికారికంగా ఆగుతున్నారు. మరో వైపు మౌలిక సదుపాయాల పరంగా కొత్తగా చేసిందేమీ లేదు. అందుబాటులో ఉన్న భవనాలకు.. కలెక్టరేట్లు.. ఇతర అధికారుల బోర్డుల తగిలించారు. కానీ చాలా వాటిలో మౌలిక సదుపాయాలు పరిమితంగా ఉన్నాయి. కొన్నింటికి కొనుగోలు చేయాల్సి ఉన్నా.. నిధులు అందని పరిస్థితి. టెండర్లు అవసరం లేదని… నేరుగా కొనాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.
ఏర్పాట్ల కోసం రూ. మూడుకోట్లను కేటాయించింది. కానీ అవి ఏ మూలకూ సరిపోని పరిస్థితి. అయినా వాటితో సర్దుకోవాలని ఆదేశించారు. దీంతో మౌలిక సదుపాయాలు అనేది చాలా పెద్ద సమస్యగా మారనుంది. టెక్నికల్ సమస్యలు కూడా పెద్ద ఎత్తున వస్తాయన్న ఆందోళనలో ఉద్యోగులు ఉన్నారు. అదే సమయంలో.. కొత్త జిల్లాల విషయంలో అనేక డిమాండ్లు వివిధ వర్గాల నుంచి వచ్చాయి. జిల్లా కేంద్రాలను మార్చడంతో పాటు త మప్రాంతాలను ఫలానా జిల్లాల్లో ఉంచవద్దనే విజ్ఞప్తులు వచ్చాయి.
వేల సంఖ్యలో వచ్చిన వీటిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నదానిపై ఇప్పటి వరకూ స్పష్టతలేదు. తుది నోటిఫికేషన్ వస్తేనే ప్రభుత్వం ఏమనుకుంటుంది తేలుతుంది. అందులో ప్రజాభిప్రాయానికి తగ్గట్లుగా లేకపోతే ఆందోళనలు చెలరేగుతాయి. అది మరింత ఇబ్బందికరంగా ఉంటుంది. ఏ ప్రభుత్వం అయినా జిల్లాల ఏర్పాటు పై పారదర్శకంగా చర్చలు జరిపి.. అందరికీ ఓ అవగాహన కల్పించి అమలు చేస్తుంది. కానీ వైసీపీ ప్రభుత్వం పూర్తి గోప్యంగా వ్యవహారాలు చక్క బెడుతోంది. ఫలితంగా జిల్లాల ప్రకటన తర్వతా ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయో అంచనా వేయడం కష్టం. ఎలాంటి ఇబ్బందులెదురైనా.. పాలనే కుంటు పడుతుంది.