మార్చి 29వ తేదీన తెలుగుదేశం పార్టీ ఓ ప్రత్యేకమైన మైలు రాయి అందుకుంటోంది. నలభై ఏళ్ల వయసు చేరుకుంటోంది. నలభై ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చెరుగని సంతకం టీడీపీది. అందుకే ఆ పార్టీ నేతలు ఊరూవాడా.. ప్రత్యేక సంబరాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఎన్నికల మూడ్ కనిపిస్తుందన ఆ పార్టీ నేతల్లో మరింత జోష్ కనిపిస్తోంది. వారి పార్టీ వారు ప్రచారం చేసుకుంటారు.. సంబరాలు చేసుకుంటారు. అయితే పోటీగా వైసీపీ కూడా మార్చి 29న టీడీపీకి భారీగా ప్రచారం చేయాలని నిర్ణయించారు.
టీడీపీకి వైసీపీ పాజిటివ్ ప్రచారం చేయడం అనేది అసాధ్యమని తెలుసు. ఎలాంటి ప్రచారం చేసినా అది నెగెటివ్దే. అందుకే.. టీడీపీ వల్ల.. చంద్రబాబు వల్ల ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిపోయిందని కథలు కథలుగా చెప్పడానికి వైసీపీ అనుబంధ మీడియా ఇప్పటికే చాలా ప్రణాళికలు సిద్ధం చేసింది. వారి కసరత్తును తమ సంబరాలు చేసుకోవడానికి టీడీపీ నేతలు కూడా చేసి ఉండరు. ఈ ప్రచారంలో ప్రధానంగా చంద్రబాబునే టార్గెట్ చేయబోతున్నారు. ఆ తర్వాత లోకేష్‌ను టార్గెట్ చేయబోతున్నారు. ఓ వైపు టీడీపీ సంబరాలు చేసుకుంటూంటే.. మరో వైపు వైసీపీ నేతలు చంద్రబాబు , లోకేష్‌లను బండ బూతులు తిట్టబోతున్నారన్నమాట.
ఏపీలో ఉన్న రాజకీయంలో ఇప్పుడు.. ఎదుటి పార్టీ సంబరాలు చేసుకున్నా… బూతులతో విరుచుకుపడటం కొత్త వ్యూహం. వారు పుట్టిన రోజు జరుపుకున్నా.. పెళ్లి రోజు జరుపుకున్నా వారిని వ్యక్తిగతంగా దూషించి.. వారిని మానసికంగా వేధించడమే రాజకీయం. దీన్ని పార్టీకి అన్వయించబోతున్నారు. అయితే టీడీపీ నేతలు మాత్రం.. వైసీపీ నేతలు.. ఆ పార్టీ మీడియా టీడీపీ గురించి ఎంత నెగెటివ్‌గా చెబితే.. తమకు అంత మంచిదని అనుకుంటున్నారు. ఎంత ఎక్కువ కవరేజీ ఇచ్చినా చాలనుకుంటున్నారు. రాజకీయాల్లో మంచి అనుకున్నా.. చెడు అనుకున్నా.. ఎప్పుడూ వార్తల్లో ఉండటమే ముఖ్యమని.. టీడీపీ ఆవిర్భావ దినోత్సరం రోజు ప్రత్యర్థి మీడియాలోనూ ప్రముఖంగా వస్తే అంతకు మించి కావాల్సిందేమిటని అనుకుంటున్నారు.