తెలుగుదేశం పిలుస్తోంది రా.. కదలి రా ! అంటూ నలభై ఏళ్ల క్రితం 1982 మార్చి 29వ తేదీన ఎన్టీఆర్ ఇచ్చిన పిలుపు ఓ ప్రభంజనం అయింది. ఓ విజయం మరో సంక్షోభం.. అంతకు మించి సవాళ్లు ఎన్నో ఎదుర్కొంటోంది. కానీ ఎప్పటికప్పుడు కాల పరీక్షలో నిలబడుతూనే ఉంది. జాతీయ పార్టీలు తప్ప.. నలభై ఏళ్ల పాటు నిలబడిన ప్రాంతీయ పార్టీలు లేవు. టీడీపీని దెబ్బకొట్టడానికి ఓ రాష్ట్రాన్ని సైతం విభజించి ఓ ప్రాంత ప్రజల భవిష్యత్ ను అంధకారం చేయడానికి కూడా వెనుకాడని రాజకీయం టీడీపీ చూసింది. కానీ అన్నింటికీ తట్టుకుని నిలబడింది. ఎప్పటికప్పుడు ఎదురవుతున్న సవాళ్లను మొక్కవోని ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొంటూ… కష్టాల్లో ఉన్నప్పుడల్లా ప్రజలకు గుర్తొస్తోంది.
ఆవిర్భావమే సంచలనం !
కాంగ్రెస్ పార్టీ పాలనతో కుంగి కృశించి పోతున్న రాష్ట్రానికి… పదే ప్రజల గురించి పట్టించుకునే పరిస్థితులు లేని కాలంలో ఎన్టీఆర్ పార్టీని పెట్టాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా ఆరంగేట్రం చేసి తొమ్మిది నెలల్లోనే ఎవరూ ఊహించని విజయం సాధించారు. అది చరిత్ర తిరగరాసిన విజయం. ప్రజల్ని ఆకట్టుకున్న నందమూరి తారకరాముడి చరిష్మాకు కట్టిన పట్టం. కిలో రూ. రెండుకే బియ్యం అంటూ ఆయన పెట్టిన సంక్షేమ పథకాలతో పేదల ఐదు వేళ్లూ నోట్లోకి వెళ్లే్ గొప్ప పథకాలు రూపకల్పన చేశారు. అదే సమయంలో ప్రజల బతుకులు మార్చేలా భవిష్యత్ గురించి ఆలోచించారు.
బడుగు బలహీనవర్గాలు గౌరవంగా బతకగలుగుతోంది టీడీపీ వల్లనే !
ఉమ్మడి ఏపీలో 1980 తర్వాత దిగ్గజాలనదగ్గ బీసీ నేతల పేర్లు తీస్తే చాలు… బీసీలకు ఎంత బలమైన నాయకత్వాన్ని తెలుగుదేశం పార్టీ ఇచ్చిందో సులువుగా అర్థమైపోతుంది. బలహీనవర్గాలకు రాజ్యాధికారాన్ని ఇచ్చేందుకు టీడీపీ ఎప్పుడూ వెనుకాడలేదు. ఊరకనే డమ్మీ కుర్చీల్లో వారిని కూర్చోబెట్టి ఇతరులతో బండి నడిపించడం కాదు.. వారే పాలన చేసేలా ప్రోత్సహించారు. టీడపీ ఇచ్చిన ఆ ప్రోత్సాహమే ఇప్పుడు అనేక మంది బడుగు, బలహీనవర్గాల నాయకులు తెరపైకి రావడానికి కారణం అయింది. ఆ తర్వాత అలాంటి నాయకత్వంలో చాలా మంది టీడీపీని విడిచి పెట్టి సొంత పార్టీని విమర్శించి ఉండవచ్చు… అది రాజకీయం అని సరిపెట్టుకోవాలి. కానీ వారి రాజకీయ జీవితానికి పునాది వేసింది టీడీపీనే.
విజయాల వెంట సంక్షోభాలు !
తెలుగుదేశం పార్టీ పయనం ఎప్పుడూ నల్లేరుపై నడక కాదు. ప్రతి విజయం అనంతరం సంక్షోభం ఉంది. 1983లో ఎన్టీఆర్ తిరుగులేని విజయం సాధిస్తే.. నాదెండ్ల భాస్కరరావు రూపంలో సంక్షోభం ఎదురయింది. అప్పుడే ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం చేసి అధికారాన్ని కాపాడుకున్నారు. ఆ తర్వాత ఎన్నికల్లో ఓటమి.. మళ్లీ గెలుపు. కానీ లక్ష్మిపార్వతి రూపంలో అతి పెద్ద సవాల్‌ను ఎదుర్కొంది. ఇక పార్టీ ఉంటుందా ఉండదా అనే పరిస్థితి వచ్చింది. పార్టీ నాది.. నాతోనే పోతుందని ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలతో పార్టీని కాపాడుకోవాలన్న తాపత్రయం అందరిలోనూ కనిపించింది. ఫలితంగా నాయకత్వం చంద్రబాబు చేతికి వచ్చింది.
నాయకుల్ని కాదు టీడీపీని కోరుకున్న జనం !
ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని పెట్టి ఉండవచ్చు. కానీ ఆయన ఎన్నికల్లో తన కటౌట్‌తో తిరుగులేని విజయం సాధించిన తర్వాత… కూడా ఆయనను పక్కన పెట్టి పార్టీని కాపాడుకోవాలని అందరూ ప్రయత్నించినప్పుడు ప్రజలు స్వాగతించారు.ఎన్టీఆర్‌ను కూడా పట్టించుకోలేదు. అంటే ప్రజలు టీడీపీని కోరుకున్నారు… నాయకుల్ని కాదని అర్థం చేసుకోవచ్చు. ఇవాళ పార్టీకి చంద్రబాబు నాయకుడిగా ఉన్నారు. రేపు మరొకరు ఉంటారు. సమర్థులైన నాయకులు ఎవరు వస్తే టీడీపీ తరపున ప్రజలు వారిని ఆదరిస్తారు. ప్రజలకు కావాల్సింది టీడీపీనే అని సులువుగానే అర్థం చేసుకోవచ్చు.
టీడీపీని లేకుండా చేయడానికి ఎన్నెన్ని కుట్రలో !
1983లో టీడీపీ సంచలన విజయం సాధించిన తర్వాత ఇందిరాగాంధీ హయాంలో జరిగిన నాదెండ్ భాస్కర్ రావు దగ్గర్నుంచి టీడీపీని లేకుండా చేయడానికి పన్నిన పన్నాగాలు అన్నీ ఇన్నీ కావు చివరికి ఉమ్మడి రాష్ట్ర విభజన లక్ష్యం కూడా టీడీపీని లేకుండా చేయడమే. ఈ విషయం అంచనా వేయడానికి పెద్ద సమీకరణాలు అక్కర్లేదు. ఇందిరాగాంధీ, వైఎస్.. ఇప్పుడు జగన్ అందరూ టీడీపీని లేకుండా చేస్తామని చెబుతున్నవాళ్లే. అధికారం అడ్డం పెట్టుకుని ప్రయత్నిస్తున్న వాళ్లే. కానీ టీడీపీ ఎప్పటికప్పుడు ప్రజల మద్దతుతో పైకి ఎదుగుతూనే ఉంది.
టీడీపీ అంటే సంక్షేమ ఫలం… అభివృద్ధి సంతకం !
రూ. రెండు కిలో బియ్యం పథకం దగ్గరనుంచి టీడీపీ చేపట్టిన అనేక సంక్షేమ పథకాలు ప్రజల జీవితాలను మార్చేశాయి. ప్రజలకు ఓ పూటతిండి పెట్టడం కాదు.. వారు సంపాదించుకునేలా చేయగలగాలన్న ది టీడీపీ సిద్ధాంతం. ఆ ప్రకారం ఎన్నో కార్యక్రమాలకు రూపకల్పన చేసింది. ఇక అభివృద్ధి విషయంలో ఏ ఒక్క ఇతర పార్టీ టీడీపీకి సాటి రాలేదు. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని లక్షలకుటుంబాలు ఇవాళ ఐటీ రంగం ఫలితాలు పొందుతున్నాయంటే.. అది టీడీపీ వేసిన విత్తుల వల్లే. విభజిత రాష్ట్రానికి ఓ అమరావతిని స్వప్నించినా… ఇన్ఫ్రా అభివృద్ది చేసినా … అది టీడీపీ వల్లే. సంక్షేమాభివృద్ధి కలగలిపిన రాజకీయం టీడీపీ నలభై ఏళ్ల పాటు చేసింది.
కష్టాలొచ్చినప్పుడు ప్రజలకు గుర్తుకొచ్చేది టీడీపీనే !
ఇక టీడీపీ తప్ప రాష్ట్రాన్ని ఎవరూ బాగు చేయలేరు.. చెడిపోయిన మన బతుకుల్ని టీడీపీనే బాగు చేస్తుందని.. టీడీపీ వస్తే కాస్త గాడినపడతాం అనుకునే పరిస్థితులు వచ్చినప్పుడే టీడీపీని ప్రజలు ఆదరిస్తున్నారు. ఈ టర్మ్‌లో బాగా పని చేశాం… మరో చాన్స్ ఇవ్వమంటేటీడీపీకి ఇవ్వడంలేదు . అభివృద్ధి రాజకీయాలు గిట్టుబాటు కాని ప్రతీ సారి టీడీపీ ఓడిపోతూ వస్తోంది. అయితే అవకాశం ఇచ్చిన ప్రతీ సారి టీడీపీ నిరూపించుకుంటూనే ఉంది. కష్టాలు లేకుండా ప్రజలను చూసుకుంటోంది. అయితే కడుపు నిండిన వాళ్ల ఆశలు తీర్చడం ఎవరి వల్లా కాదు కాబట్టి ఓటమి అంచుకు చేరుతోంది. రాష్ట్ర విభజన తర్వాత దిక్కూదివాణం లేని పరిస్థితుల్లో అధికారం చేపట్టిన టీడీపీ ఐదేళ్లలో ఒక్క పన్ను పెంచకుండా… పాలన చేశారు. ఉద్యోగులకు ఊహించనంత మేలు చేశారు. ఉపాధి అవకాశాలు భారీగా పెంచారు. అమరావతి కోసం పది వేల కోట్ల ఖర్చు పెట్టారు. కానీ ప్రజలు ఇంకేదో కోరుకున్నారు.
ప్రజల్ని చీల్చి లబ్ది పొందే రాజకీయంలో టీడీపీ ఫెయిల్ !
చరిత్రలో రాజకీయ పార్టీలన్నీ ప్రజల్ని చీల్చి బలంగా ఎదిగినవే. బీజేపీ హిందూత్వాన్ని… టీఆర్ఎస్ ప్రాంతీయ వాదాన్ని.. వైసీపీ కమ్మ కుల వ్యతిరేకతను పెంచి విజయాలు అందుకున్నవే. అందుకుంటున్నవే. కానీ టీడీపీ ఎప్పుడూ ఇరా ప్రజల్ని విడదీసే ప్రయత్నం చేయలేదు. ఒక వేళ చేసి ఉన్నా సక్సెస్ కాలేదు. కాకూడదుకూడా. అలాంటి రాజకీయాలతో మనుగడ సాగించే టీడీపీని ప్రజలు కోరుకోరు.
ఎప్పట్లాగే టీడీపీ ఇప్పుడు మరో సంక్లిష్టమైన సవాల్ ఎదుర్కొంటోంది. టీడీపీ వస్తేనే బతుకులు బాగుపడతాయ్ అనిప్రజలు అనుకుంటే మళ్లీ పట్టం కడతారు. తెలుగుదేశం పార్టీ నాది.. నాతోనే పోతుందని ఎన్టీఆర్ చెప్పారు. కానీ పోలేదు. చరిత్రలో టీడీపీ ఎక్కడికీ పోదు. ఆపార్టీకి నాయకుల కొరత లేదు. నిన్న ఎన్టీఆర్.. నేడు చంద్రబాబు .. రేపు రామ్మోహన్ నాయుడు కావొచ్చు… లేకపోతే ఇంకొక యువనేత కావొచ్చు.. టీడీపీకి నాయకులు ఉంటారు. ప్రజల్లో ఉంటుంది. తెలుగు వారికి ఓ చారిత్రక అవసరంగా టీడీపీ నిలబడుతుంది.