కర్నూలులో సినిమా స్టూడియో కడతానని ప్రముఖ నిర్మాత కేఎస్ రామారావు ముందుకు వచ్చారు. కర్నూలులో పర్యటించిన ఆయన సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి RRR సినిమాకు ఎంతో సహకారం అందించారని.. పెద్ద,చిన్న సినిమాలకు ఏపీ ప్రభుత్వము అండగా నిలిచిందని చెప్పుకొచ్చారు. కర్నూలులో సినిమాకు సంబంధించిన అనువైన ప్రదేశాలు చాలా ఉన్నాయని..కర్నూలులో సినిమా షూటింగ్, ఫిల్మ్ క్లబ్ ఏర్పాటుకు సినీ పెద్దలు ఆలోచించాలని సూచించారు.
ఉగాది పండుగ తరువాత ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వ పెద్దలను, సినీ పెద్దలను సంప్రదిస్తామన్నారు. కర్నూలును సినిమా ఇండస్ట్రీ హబ్ గా చేసేందుకు ముందుకు వెళ్తామని తుంగభద్ర నది, కెసి కెనాల్, సమ్మర్ స్టోరేజ్, బాలసాయి స్కూల్ అనువైన ప్రాంతాలను గుర్తించాంమన్నారు. కర్నూలులో 12 ఎకరాల్లో ఫిలిం సిటీగా అభివృద్ధి చేసేందుకు ముందుకు వస్తామన్నారు. కేఎస్ రామారావుకు హఠాత్తుగా కర్నూలులో సినిమా స్టూడియో పెట్టాలనే ఆలోచన ఎందుకు వచ్చిందో కానీ.. సీఎం జగన్‌పై ప్రశంసలు కురిపించేస్తున్నారు.
నిజానికి ఇటీవల టిక్కెట్ల ఇష్యూలో ఆయన ప్రభుత్వ వ్యతిరేక కామెంట్లు చేశారు. ప్రస్తుతం విశాఖ ఫిల్మ్ నగర్ కల్చరల్ క్లబ్‌కు ఆయన అధ్యక్షుడిగా ఉన్నారో క్లారిటీ లేదు. ఆయనను తొలగించి వైసీపీ నేతలు సొంత వారిని నియమించుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాల నేపధ్యంలో ఆయన ఫిల్మ్ సిటీని కర్నూలులో పెడతానని చెబుతూ జగన్‌ను పొగడటం … ఇండస్ట్రీలోని వారిని కూడా ఆశ్చర్య పరుస్తోంది.