తెలంగాణ సీఎం సోమేష్ కుమార్ ఏపీ క్యాడర్‌కు వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఆయనను విభజన సమయంలో ఏపీ క్యాడర్‌కు కేటాయించారు. కానీ ఆయన అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యూనల్‌కు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. తెలంగాణలో చీఫ్ సెక్రటరీ అయిపోయారు. వాస్తవానికి సీఎస్ అయ్యేంత సీనియారిటీఆయనకు లేదు. మధ్యలో రెండు సార్లు నాలుగేళ్ల పాటు సర్వీసును వదిలి ప్రైవేటు సంస్థల్లో పని చేశారు. పది మందికిపైగా సీనియర్లు ఉన్నప్పటికీ కేసీఆర్ సోమేష్‌కు చీఫ్ సెక్రటరీ పదవి ఇచ్చారు.
అయితే ఇప్పుడు ఆయన ఏపీ క్యాడర్ అధికారి అంటూ కోర్టుల్లో పిటిషన్లు పడ్డాయి. ఈ పిటిషన్లపై విచారణలో కేంద్రం తన వైఖరి స్పష్టంగానే చెప్పింది. ఆయన ఏపీకి వెళ్లాల్సిందేనని తేల్చేసింది. ఆయనను ఏపీ క్యాడర్‌కు కేటాయించడంలో ఎలాంటి నియమ నిబంధనల ఉల్లంఘన జరగలేదని … అంతా సవ్యంగానే జరిగిందని కేంద్రం కోర్టుకు తెలిపింది. అదే సమయంలో సోమేష్ కుమార్ చేసిన వాదనల్లో కూడా పస లేదని తేలిపోయింది. తనను ఉద్దేశపూర్వకంగా ఏపీకి కేటాయించారని ఆయన వాదనలు కరెక్ట్ కాదని కేంద్రం బలమైన వాదనలు వినిపించింది. దీంతో .. ఇప్పుడు ఆయనను ఏపీకి కేటాయిస్తూ కోర్టు నిర్ణయం వచ్చే చాన్స్ ఉందని తెలంగాణ అధికారవర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
సీఎస్ తీరుపై బీజేపీ కూడా అసంతృప్తిగా ఉంది. ఆయనపై కేంద్రానికి పలుమార్లు ఫిర్యాదులు కూడా చేశారు. ఈ క్రమంలోకేంద్రం ఆయనను ఏపీకి పంపాలనే స్పష్టమైన అభిప్రాయంతో ఉండటంతో … సోమేష్ తన క్యాడర్‌ను కాపాడుకోవడం కష్టమని ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే కేసీఆర్కుకూడా ఇబ్బందికరమే. ఆయన ఏరికోరి వచ్చే ఎన్నికల వరకూ సోమేష్ ఉండేలా చీఫ్ సెక్రటరీ పదవి ఇచ్చారు. బీజేపీ చేయదల్చుకుంటే ఏమైనా చేయగలుగుతుందని సీఎం విషయంలో జోరందుకున్న పరిణామాలతో కొందరు విశ్లేషిస్తున్నారు.