వాహనాలకు ఉన్న బ్లాక్ స్టిక్కర్లు, బ్లాక్ ఫిల్మ్‌లను తొలగించాలని గత కొన్నిరోజులుగా ట్రాఫిక్ పోలీసులు విస్తృతంగా ప్రచారం చేస్తోన్న సంగతి తెలిసిందే. అలా తొలగించని వారి వాహనాలకు ఫైన్స్ కూడా వేస్తున్నారు. ఇటీవల ఎన్టీఆర్, అల్లు అర్జున్, కల్యాణ్‌రామ్ కార్లకు ఉన్న బ్లాక్ ఫిల్మ్‌నును పోలీసులు తొలగించి జరిమానా వేసిన సంగతి తెలిసిందే. తాజాగా హీరో మంచు మనోజ్ కారుకు ట్రాఫిక్ పోలీసులు చలానా విధించారు. టోలిచౌకి వద్ద తనిఖీలు చేస్తున్న పోలీసులు.. అటుగా వెళ్తున్న మనోజ్ కారుని ఆపారు. తనిఖీల్లో భాగంగా ఆయన కారుకు ఉన్న బ్లాక్ ఫిల్మ్‌ను తొలగించి రూ.700 చలానా విధించారు. తనిఖీలు జరిగిన సమయంలో మనోజ్ కారులోనే ఉన్నారు.
సాదారణంగా సెలబ్రీటీలు ప్రైవసీ కోసం బ్లాక్ ఫిల్మ్‌లు వాడుతుంటారు. అయితే బ్లాక్ ఫిల్మ్ లు వాడకం వలన లాభాలు కంటే నష్టాలే ఎక్కువ. నేరస్తులు తప్పించుకోవడానికి బ్లాక్ ఫిల్మ్ వున్న వాహనాలు వాడుతున్నట్లు తేలింది. అంతేకాదు మహిళలపై లైంగిక దాడులు, దొంగతనాలు, కిడ్నాపులకు పాల్పడేవారు ఈ బ్లాక్ ఫిల్మ్ వున్న వాహనాలు ఉపయోగించి తప్పించుకున్నట్లు పలు విచారణలులో తేలింది. దీంతో న్యాయస్థానాలు వీటి వాడకంపై నిషేధం విధించాయి. అయితే న్యాయస్థానాల ఆదేశాలు జారీ చేసినప్పటికి కొందరు ఫైన్ వరకూ తెచ్చుకుంటున్నారు ఈ విషయంలో న్యాయస్థానాల ఆదేశాలని గౌరవించి సెలబ్రీటీలు స్వతహాగా బ్లాక్ ఫిల్మ్ ని తొలగిస్తే రియల్ లైఫ్ లో కూడా నలుగురుకి ఆదర్శంగా నిలిచినవారౌతారు.