‘అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని’ అన్నట్టుగా మారింది హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్. సంఘంలోని పెద్దల అంతర్గత కుమ్ములాటలు వల్ల అధోగతి దిశగా వెళుతుంది హైదరాబాద్ క్రికెట్ భవిష్యత్. హైదరాబాద్ లో మ్యాచులు జరగడం పూర్తిగా తగ్గిపోయింది. కరోనా అని కాదు, అంతకుముందు కూడా అంతే. కొన్నేళ్లుగా ఐపీయల్ సీజన్ తప్పా చెప్పుకోదగ్గ మ్యాచులకు ఆతిధ్యం ఇవ్వలేకపోయింది హైదరాబాద్. ఈ ఏడాది ఐపీయల్ కూడా ఇక్కడ జరగడం లేదు.
ఇండియన్ క్రికెట్ మహారాష్ట్రలో పుట్టి పెరిగినట్లు ఈ ఏడాది మ్యాచులన్నీ ముంబాయి, పూణేలోనే లాగించేస్తుంది బిసిసిఐ. కరోనా నాలుగో వేవ్ వుండటం కారణంగా మహారాష్ట్రనే ఎంచుకున్నామనేది బిసిసిఐ మాట. ఇది కొంచెం కామెడీనే. మహారాష్ట్రంలో కరోనా విలయ తాండవం చేసింది. దేశంలోనే అత్యధిక మరణాలు ఆ రాష్ట్రంలో చోటు చేసుకున్నాయి. ఇప్పటికీ ఆ రాష్ట్రంలోనే ఎక్కువ కేసులు బయటపడుతున్నాయి. అయినప్పటికీ ఐపియల్ ని అక్కడే పెట్టుకున్నారు. దిన్ని ఎవరూ గట్టిగా అడగలేని పరిస్థితి. కారణం.. మహారాష్ట్ర క్రికెట్ బోర్డ్ డామినేషన్ ఆ స్థాయిలో వుంది.
అయితే హైదరాబాద్ పరిస్థితి మరోలా వుంది. ఇక్కడ రాజీవ్ గాంధీ ఇంటర్ నేషనల్ స్టేడియం ఉప్పల్ మంచి సామర్ధ్యంతో నిర్మించారు. ఐపీయల్ నైట్స్ తో మైదానం వెలిగిపోయేది. కానీ ఇప్పుడు ఎలాంటి దుస్థితి పట్టిందంటే.. మూడు నెలలుగా స్టేడియంకి కరెంట్ లేదు. రూ.2 కోట్ల రుపాయిలు బకాయిపడిపోడంతో స్టేడియంకి కరెంట్ కట్ చేశారు. బోర్డు లో జరుగుతున్న అవినీతి అక్రమాలపై ఇటివలే సుప్రీం కోర్టు మొట్టికాయలు వేసింది. ”ఇక్కడ మ్యాచ్ పెట్టమని కోరితే అసలు నిర్వాహకులు ఎక్కడున్నారు ?అని స్వయంగా తెలంగాణ క్రికెట్ బోర్డ్ లో ఓ ప్రముఖ వ్యక్తి అభిప్రాయపడ్డారంటే హెచ్.సి.ఎ ఎంతటి దుస్థితిలో వుందో అర్ధం చేసుకోవచ్చు. నిజానికి ఇక్కడ సమస్య ఆర్ధికంగా కాదు.. బోర్డులో అంతర్గత కుమ్ములాటలు. ఈ అంతర్గత రాజకీయాలు ఫుల్ స్టాప్ పడితే పునర్ వైభవం తీసుకురావడం పెద్ద విషయం ఏమీ కాదు. మరి హైరాబాద్ క్రికెట్ కి మంచి రోజులు ఎప్పుడొస్తాయో చూడాలి.