కొత్త జిల్లాల విషయంలో వైసీపీ అధినేత, సీఎం జగన్ చేస్తున్న రాజకీయం ప్రమాదకరంగా మారుతోంది. పెద్ద ఎత్తున ప్రజలు ఇచ్చిన వినతులు పెండింగ్లో ఉన్నాయి. వాటిపై సీఎం జగన్ నిర్ణయం తీసుకుంటారని ప్రకటించారు. ఆయన నిర్ణయం తీసుకున్నారు కూడా. వర్చువల్ కేబినెట్ భేటీ నిర్వహించి … ఆమోదం తీసుకున్నారు. కానీ ఇంత వరకూ ఎలాంటి ప్రకటన చేయలేదు. సున్నితమైన అంశం కావడం.. పెద్ద ఎత్తున ఉద్యమంచిన ప్రాంతాలు.. అలాగే సొంత పార్టీల నేతల డిమాండ్లను ఎంత మేర పట్టించుకున్నారన్నది ఇప్పుడుకీలకం.
ప్రజలు ఆశలు, ఆకాంక్షలు కాకుండా రాజకీయ అవసరాల కోసం విభజన చేస్తున్నారన్న అభిప్రాయం ఇప్పటికే ప్రజల్లో బలపడింది. చాలా చోట్ల ముందుగా చెప్పినట్లుగా పార్లమెంట్ నియోజకవర్గాలను జిల్లాలను చేస్తూ…జిల్లా కేంద్రాన్ని మాత్రం మరో చోటికి మార్చారు. ఈ క్రమంలో ప్రజలు ఉద్యమించారు. అవి ఇంకా కొనసాగుతున్నాయి. హిందూపురం జిల్లా కేంద్రాన్ని హిందూపురంలోనే ఉంచారని.. నర్సాపురం జిల్లా కేంద్రాన్ని నర్సాపురంలోనే ఉంచాలని రాజంపేట జిల్లా కేంద్రం కోసం ఉద్ధృతమైన పోరాటం జరుగుతోంది. అదేసమయంలో వైసీపీ నేతలు కూడా ఈ అంశాలపై వినతి పత్రాలు ఇచ్చారు.
జిల్లాల విభజన…విషయంలో ప్రతీ జిల్లాలోనూ వైసీపీ నేతలు తమ అభ్యంతరాలను ప్రభుత్వానికి చెప్పారు. రెవిన్యూ డివిజన్లు, మండలాలు ఇలా చాలా విషయాల్లో వారికి అభ్యంతరాలు ఉన్నాయి. వాటన్నింటినీ ప్రభుత్వానికి నివేదించారు. కానీ అదే సమయంలో వైసీపీలోనే లాబీయింగ్ చేసి .. తమ ప్రాంతాలకు మేలు చేసుకున్న నేతలు ఉన్నారు. వారి ఒత్తిడీ అలాగే ఉంది. ఇలాంటి క్రమంలో బహిరంగ ప్రకటన చేయకుండా.. .నేరుగా జిల్లాల తుది నోటిఫికేషన్ విడుదల చేయాలని నిర్ణయించడం కలకలంరేపే అవకాశం కనిపిస్తోంది.
సాధారణంగా ఏ ప్రభుత్వమైన సంపూర్ణమైన చర్చల తర్వాత ప్రజల అంగీకారంతో… లేదా కనీసం అంగీకారం లభించినట్లుగా చర్చలు జరిపి అయినా జిల్లాల విభజన చేస్తుంది. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం తాము ఏది అనుకుంటే..అది చేస్తోంది. ప్రజల రియాక్షన్లో తేడా వస్తే మాత్రం ప్రభుత్వానికి అంత కన్నా మైనస్ మరొకటి ఉండదు.