తెలంగాణ రాజకీయాలు అధికార వ్యవస్థపై మైండ్ గేమ్ ఆడే దశకు చేరాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వ్యవస్థలపై తమ పట్టు నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో టీఆర్ఎస్ ఇప్పటి వరకూ రాష్ట్ర అధికార పార్టీగా తిరుగులేని ఆధిపత్యం కొననసాగిస్తోంది. కానీ ఇప్పుడు మారుతున్న రాజకీయ పరిస్థితుల్లో బీజేపీ తన పట్టు పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్.. నేరుగా డీజీపీ మహేందర్ రెడ్డిని టార్గెట్ చేశారు. ఆయనను దద్దమ్మగా అభివర్ణించారు.
టీఆర్ఎస్ నేతలు దాడులు చేస్తున్నా.. బీజేపీ కార్యకర్తలపై కేసుల పెడుతున్నారని అంటున్నారు. లా అండ్ ఆర్డర్‌ను పరిరక్షించడం చేతకాకపోతే దద్దమ్మను అని తనను తాను అంగీకరించాలని డీజీపీకి బండి సంజయ్ సవాల్ చేశారు. ఇటీవల ఎల్లారెడ్డిపేటలో టీఆర్ఎస్- బీజేపీ మధ్య ఘర్షణ జరిగింది. ఈ కేసుల్లో బీజేపీ నేతలను అరెస్ట్ చేశారు. వారు బెయిల్‌పై విడుదలైన సందర్భంగా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. పోలీసు వ్యవస్థపై ఎంత పట్టు ఉంటే అధికార పార్టీకి అంత మంచిది. ఈ విషయంలో కేసీఆర్ ఇప్పటి వరకూ ఎప్పుడూ ఫెయిల్ కాలేదు. కానీ అధికార పార్టీ ఆత్మరక్షణ ధొరణిలో ఉంటే పోలీసుల్లోనూ మార్పు వస్తుంది.
దీన్ని పసిగట్టిన బండి సంజయ్ .. కేంద్ర అధికార పార్టీ నేతగా.. మరింత ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్ జైలుకు వెళ్తారని.. కొంతమంది పోలీస్ లు సీఎం మోచేతి నీళ్లు తాగి వారికి అనుగుణంగా పని చేస్తున్నారని వారిని వదిలి పెట్టబోమంటున్నారు. రిటైరైన తర్వాత వదలబోమని ఆయన చెబుతున్నారు. తనపై విమర్శలు చేస్తున్న పోలీసు అధికారుల సంఘాల నేతలకూ బండి సంజయ్ వార్నింగ్ ఇస్తున్నారు. పోలీసులపై బీజేపీ పెడుతున్న ఒత్తిడి ఫలిస్తే.. టీఆర్ఎస్ పట్టు సడలినట్లే అవుతుంది. అదే జరిగితే .. మొదటికే మోసం వస్తుందన్న ఆందోళన టీఆర్ఎస్లో కనిపిస్తోంది.