నందిని రెడ్డి దర్శకత్వంలో నాగచైతన్య ఓ సినిమా చేయబోతున్నాడు. అందుకు సంబంధించిన స్క్రిప్టు రెడీ అయ్యింది. ప్రస్తుతం సంతోష్ శోభన్ తో ఓ సినిమా చేస్తోంది నందిని. ఆ వెంటనే.. చైతూతో ప్రాజెక్టు పట్టాలెక్కబోతోంది. అయితే ఇది ఇప్పటి కథ కాదు. `ఓ బేబీ` తరవాత సమంతతోనే మరో సినిమా చేద్దామనుకొంది నందిని. అప్పట్లో చైతూ – సమంతకి సెట్ చేసిన ప్రాజెక్ట్ ఇది. ఇద్దరికీ కథ చెప్పి ఓకే చేయించుకొంది నంది. సమంత – నందిని మంచి ఫ్రెండ్స్. పైగా `ఓ బేబీ` హిట్టుతో మంచి ఫామ్‌లో ఉన్నారు. అందుకే చై కూడా ఓకే అనేశాడు.
ఇప్పుడు సమంత – చైతూ విడిపోయారు. ఎవరి దారి వాళ్లదే. ఎవరి జీవితం వాళ్లదే. ఇప్పుడు వీళ్ల కాంబో సెట్ చేయడం అసాధ్యం. అందుకే చైతూ సరసన మరో కథానాయికని ఎంచుకోవాల్సి వస్తుంది. అదేం పెద్ద కష్టమైన పని కాదు. కాకపోతే.. సమంత – నందిని ఇద్దరూ మంచి దోస్తులు. సమంత – చైతూల కోసం రాసుకొన్న కథ వేరే వాళ్లతో తీయడం ఆమెకు ఇబ్బందిగానే ఉంటుంది. సమంత వల్ల సెట్ అయినప్రాజెక్ట్, సమంతనే హీరోయిన్ అనుకొన్న కథ.. ఆమె లేకుండా పట్టాలెక్కించడం మరో రకమైన ఇబ్బంది. సినిమాల్లో ఇవన్నీ మామూలే అనుకోవాలంతే. మరి.. సమంత స్థానాన్ని నందిని ఎవరితో భర్తీ చేస్తుందో చూడాలి.