హైకోర్టు తీర్పులను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించడం ఏపీ ఐఏఎస్ అధికారులకు కామన్ అయిపోయింది. ఇంత కాలంచెప్పిన చూసిన హైకోర్టు ఇప్పుడు శిక్షల వరకూ వెళ్లింది. ఏకంగా ఒకేసారి ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులకు జైలు శిక్ష విధించింది. ఉలిక్కిపడిన వారు వెంటనే క్షమాపణలు చెప్పి శిక్షను మార్పించుకోగలిగారు. లేకపోతే ఒకే సారి ఎనిమిది మంది ఐఏఎస్‌లు జైలుకెళ్లిన రికార్డు ఏపీ ప్రభుత్వానికి దక్కి ఉండేది.
పాఠశాలల్లో గ్రామ సచివాలయాల ఏర్పాటు చేయొద్దని గతంలో హైకోర్టు ఆదేశించింది.అయితే వీటిని అధికారులు పట్టించుకోలేదు. దీంతో పలుమార్లు జరిగిన విచారణల్లో చేస్తాం.. చేస్తామని చెబుతూ వచ్చినప్పటికీ చేయలేదు. దీంతో అధికారుల వైఖరిని కోర్టు ధిక్కరణగా తీర్పు ఇచ్చింది. ఐఏఎస్ అధికారులు విజయ్ కుమార్, శ్యామల రావు, గోపాల కృష్ణ ద్వివేది, బుడితి రాజశేఖర్, శ్రీలక్ష్మీ, గిరిజా శంకర్, వాడ్రేవు చిన వీరభద్రుడు, ఎంఎం నాయక్ లు కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లుగా నిర్ధారించింది హైకోర్టు. మొదట వీరందరికీ హైకోర్టు రెండు వారాల పాటు జైలు శిక్ష విధించింది.
వెంటనే కోర్టు ధిక్కరణపై ఐఏఎస్ లు క్షమాపణలు కోరారు. క్షమాపణలు కోరడంతో జైలు శిక్ష తప్పించి సేవా కార్యక్రమాలు చేపట్టాలని హైకోర్టు ఆదేశించింది. సంక్షేమ హాస్టళ్లల్లో ప్రతి నెలలో ఓ రోజు వెళ్లి సేవ చేయాలని తీర్పు ఇచ్చింది. ఒక రోజు పాటు కోర్టు ఖర్చులు భరించాలని ఐఏఎస్ లను హైకోర్టు ఆదేశించింది. ఏడాది పాటు హాస్టళ్లల్లో సేవా కార్యక్రమం చేపట్టాలని తీర్పు ఇచ్చింది. ఏపీ ప్రభుత్వంలో కీలక పదవుల్లో ఉన్న ఐఏఎస్‌లకు ఇది కామన్‌గా మారిపోయింది. ఆ అధికారులు కూడా సిగ్గుపడటం లేదు. కోర్టు ధిక్కరణ తమ ప్రభుత్వ విధానం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.