రేటింగ్: 2/5
ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయతో సూపర్ హిట్టు కొట్టాడు దర్శకుడు స్వరూప్. తన రెండో ప్రయత్నంగా… `మిషన్ ఇంపాజిబుల్` మలిచాడు. `ఏజెంట్…` తో సంపాదించుకున్న నమ్మకం కానివ్వండి, తన టీమ్ లోకి తాప్సిని తీసుకురావనివ్వడం కానివ్వండి.. పరమానందయ్య శిష్యుల్లాంటి ముగ్గురు పిల్లలు పోస్టర్ లో కనిపించడం కానివ్వండి.. ఆ టైటిల్.. ఇలా అన్ని రకాలుగానూ.. ఈ సినిమా ఆసక్తిని పెంచేదే. మరి… స్వరూప్ తన రెండో మిషన్ లోనూ హిట్టు కొట్టాడా? అసలింతకీ ఈ మిషన్ దేని కోసం..?
శైలు (తాప్సి) ఓ ఇన్వెస్టిగేటీవ్ జర్నలిస్ట్. ఛైల్డ్ ట్రాఫికింగ్‌పై పరిశోధనలు చేస్తుంటుంది. రామ్ శెట్టి అనే మాఫియా డాన్… బెంగళూరు నుంచి భారీ ఎత్తున పిల్లల్ని.. దుబాయ్ తరలించడానికి స్కెచ్ వేస్తాడు. దాన్ని ఎలాగైనా అడ్డుకొని, రామ్ శెట్టిని పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టివ్వాలన్నది… శైలు మిషన్. మరోవైపు.. తిరుపతికి దగ్గర్లోనిచిన్న పల్లెటూరులో రఘుపతి, రాఘవ, రాజారామ్ అనే ముగ్గురు స్నేహితులున్నారు. వాళ్ల వయసు కేవలం 11 సంవత్సరాలు. అయితే. ఊర్లో అందరికంటే ఫ్యామస్ అయిపోవాలన్నది వాళ్ల ఆశ. అందుకోసం కోటి రూపాయలు కూడబెట్టాలనుకుంటారు. దావూద్ ఇబ్రహీంని పట్టిస్తే… రూ.50 లక్షల బహుమతి ఇస్తామన్న వార్త టీవీలో చూసి… దావూద్ ని పట్టుకోవడానికి ఇంట్లో చెప్పాపెట్టకుండా ముంబై బయల్దేరతారు. ఆ మిషన్కి పెట్టుకొన్న పేరే.. `మిషన్ ఇంపాజిబుల్`. అయితే.. బెంగళూరులో ఛైల్డ్ ట్రాఫికింగ్ ని అడ్డుకోవాలని చూసిన శైలుకీ.. ముంబై వెళ్లి దావూద్ ని పట్టిచ్చి. రూ.50 లక్షల ఫ్రైజ్ మనీ కొట్టేయాలని చూసిన.. రఘుపతి రాఘవ రాజారామ్కీ లింకు ఎక్కడ కుదిరింది? ఈ రెండు మిషన్లూ… ఒక్కటిగా ఎలా మారాయి? అందులో వీళ్లు విజయం సాధించారా, లేదా? అనేది మిగిలిన కథ.
శైలు… మిషన్‌తో కథ మొదలవుతుంది. ఓ డాన్ని పదిహేడేళ్ల పిల్లాడితో… చంపించే సీన్ అది. నిజానికి.. ఇక్కడే దర్శకుడు లాజిక్‌లు వదిలేసి, మ్యాజిక్ చేద్దామని డిసైడ్ అయినట్టు హింటు దొరికేస్తుంది. ఓ ద్రోహిని చంపడానికి.. పిల్లాడి చేతికి గన్ ఇస్తారా? వాడి భవిష్యత్తేం అయిపోవాలి? అనే క్వశ్చన్… ఇన్వెస్టిగేషన్ జర్నలిస్టు అయిన శైలుకి రాకపోవడం విడ్డూరం. వచ్చినా.. దానికేదో అంతుచిక్కని లాజిక్కులు వేసుకుంటుంది. ఆ తరవాత.. ఆర్.ఆర్.ఆర్ (రఘుపతి రాఘవ రాజారామ్) కథ మొదలవుతుంది. ఈ ముగ్గురి పిల్లల పరిచయం, వాళ్ల స్నేహం, అల్లరి, దావూద్‌ని పట్టుకోవడానికి వేసే స్కెచ్‌లు చాలా సరదాగా సాగిపోతాయి. రచయితగా స్వరూప్‌కి ఇక్కడే మంచి మార్కులు పడ్డాయి. తనలో కావల్సినంత హ్యూమర్ ఉంది. అది ఈ సన్నివేశాల్లో బాగా కనిపించింది. రాజమౌళి, సుకుమార్, త్రివిక్రమ్, పూరి సినిమాల్ని ఉదహరిస్తూ.. స్కెచ్ వేయడం.. అందులో పుట్టిన ఫన్.. టైమ్ పాస్ ఇస్తాయి. ముంబై అనుకుని బెంగళూరులో అడుగుపెట్టడం… సరిగ్గా అప్పుడే… శైలు కూడా బెంగళూరులో దిగిపోవడంతో ఇంట్రవెల్ కార్డు పడుతుంది.
తొలి భాగం గంటలో ముగిసిపోయింది. పిల్లల సరదాలు, ఇంట్రవెల్ ట్విస్ట్.. వీటి మధ్య ఇన్ లాజికల్.. కథని కాస్త క్షమించేస్తాం. అయితే ద్వితీయార్థంలో ఆ అవకాశం ఇవ్వలేదు. ఈ ముగ్గురు పిల్లల కష్టాలు, డాన్ వ్యవహారాలు, ఛైల్డ్ ట్రాఫికింగ్ ఇవన్నీ బోర్ కొట్టిస్తాయి. శైలుని ఇన్వెస్టిగేషన్ జర్నలిస్టుపాత్రనా? లేదంటే… సీబీ సీఐడీనా.. అన్నట్టు ఉంటుంది. ఆమె ఆర్డర్స్ ఇస్తుంటే.. వాటిని పోలీస్ ఆఫీసర్ ఫాలో అయిపోవడం విడ్డూరం అనిపిస్తుంది. మధ్యలో `మహానది` టైపు సీనొకటి. అసలు ఆ సీన్ తీస్తున్నప్పుడైనా `మహానది`లో ఇదో పాపులర్ సీన్… అనే సంగతి దర్శకుడికి గుర్తుకు రాలేదా? అసలు ఆ సినిమానే చూడలేదా?
ముగ్గురు పిల్లల్ని అడ్డు పెట్టుకొని ఓ ప్రమాదకరమైన మిషన్ సాధించాలనుకోవడంలో శైలు హీరోయిజం ఏముంటుంది? దాంతో పాటు…. వాళ్లేమైనా తెలివైన పిల్లలా? బొంబైకీ, ముంబైకీ, ముంబైకీ బెంగళూరుకీ అసలు తేడా తెలియని అమాయకులు. నిజానికి ఈతరం చాలా ఫాస్ట్ గా ఉన్నారు. పదేళ్లకే లోకజ్ఞానం అబ్బేస్తోంది. ఇంకా… వాళ్లని పరమానందయ్య శిష్యుల్లానే చూపించడం ఎందుకో? ఆ మాటకొస్తే.. కొన్ని సీన్లలో వాళ్లని చాలా తెలివైన వాళ్లుగా చూసిస్తూ.. ఇంకొన్ని చోట్ల.. దద్దమ్మలుగా మార్చేశాడు. తనకు ఎలా కావాలంటే అలా సీన్లు రాసుకొన్నాడు. తొలి సగంలో పిల్లల అల్లరిని ఎంజాయ్ చేసి, తప్పుల్ని క్షమించేసినా.. ద్వితీయార్థంలో ఆ అవకాశం లేకుండానే చేశాడు దర్శకుడు.
తాప్సి కొత్త తరహా కథల్ని ఎంచుకొంటోంది. కథ చెబుతున్నప్పుడు ఏమూలో.. కొత్తగా అనిపించి ఉండొచ్చు. అందుకే తన పాత్ర నిడివి తక్కువైనా ఒప్పుకొంది. తాప్సి ఇందులో చేసిందేం లేదు. ఆ పాత్రలో ఎవరున్నా ఓకే. ఆ ముగ్గురు పిల్లలనటన.. మాత్రం హైలెట్. తప్పకుండా వాళ్ల స్క్రీన్ ప్రెజెన్స్ ని ఎంజాయ్ చేయొచ్చు. వాళ్ల ఫేసులో అమాయకత్వం, అతి తెలివి బాగా పండాయి. మిగిలినవాళ్ల స్క్రీన్ టైమ్ చాలా తక్కువ.
సాంకేతికంగా చూస్తే.. సినిమా ఓకే అనిపిస్తుంది. కథకు ఎంత కావాలో అంత ఖర్చు పెట్టారు. ముగ్గురు పిల్లలు… తెలియని తనంతో ఓ మిషన్ కోసం బయల్దేరి, ఇంకోటేదో సాధించుకుని రావడం అనే కాన్సెప్టు బాగుంది. కానీ… అందుకోసం ఎంచుకొన్న నేపథ్యంలో బలం లేదు. లాజిక్కులు లేవు. కొన్ని చోట్ల కామెడీ.. కాపాడింది. డైలాగులు అక్కడక్కడ ఫన్నీగా ఉన్నాయి. అంతకు మించి.. ఈ మిషన్‌లో చెప్పుకోదగిన విషయాలేం లేవు.
ఫినిషింగ్ టచ్: ఇట్స్.. ఇంపాజిబుల్
రేటింగ్: 2/5