ఆంధ్రప్రదేశ్ మంత్రుల పదవులు ఊడటం ఖాయం కావడంతో చాలా మంది తమ పనులన్నీ చక్కబెట్టేసుకుంటున్నారు. తమకు ప్రయోజనం కల్పించేవి.. తాము ప్రయోజనం కల్పించాల్సినవి ఇలా వేటిని వదిలి పెట్టకుండా చూసుకుంటున్నారు. ఈ క్రమంలో మంత్రుల పేషీల్లో సందడి కనిపిస్తోంది. అయితే ఇలాంటి పరిస్థితి కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులకు కారణం అవుతోంది. ముఖ్యంగా శాఖలపై పట్టులేని మంత్రుల పేషీల్లో దారుణమైన పరిస్థితి ఉంది. చాలా మంది మంత్రులకు శాఖలపై ఇప్పటికీ పట్టులేదు. అధికారులు.. పీఏలు.. చెప్పింది చెప్పినట్లుగా చేసి వెళ్లిపోతూంటారు. కొన్ని లెక్కలు చూసుకుని సంతకాలు పెట్టేస్తూ ఉంటారు.
మంత్రులు మారితే వాళ్లు కూడా మారిపోతారు. వారికీ అక్కడ చోటు ఉండదు. అందుకే ఇంత కాలం పెండింగ్లో ఉంటూ వచ్చిన పనులు శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ఒకరి కంటే ఎక్కువ మందిపేషీల్లో పెత్తనం చేస్తూంటే.. మాత్రం ఘర్షణలు కూడా చోటు చేసుకుంటున్నాయి. తాజాగా మంత్రి అవంతి శ్రీనివాస్ పేషీలో ఇద్దరు అనధికార అధికారులు ఘర్షణ పడినట్లుగా తెలుస్తోంది. మంత్రి పదవి ఊడటం ఖాయం కావడంతో పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేసేందుకు.. ఎవరికి వారు తమదే బాధ్యత అన్నట్లుగా వ్యవహరించడం ప్రారంభించారు.
దీంతో ఒకరు కార్యాలయానికి తాళం వేసుకున్నారు.ఈ పరిస్థితి ఇద్దరి మధ్య ఘర్షణకు దారి తీసింది. ఈ వ్యవహారం సచివాలయంలో చర్చనీయాంశం అయింది. మంత్రి అవంతి శ్రీనివసరావు పర్యాటక మంత్రిగా ఉన్నారు కానీ ఆయన విధానపరమైన నిర్ణయాలేమీ తీసుకోలేరు. మొత్తం ఆయన బంధువు చేతుల్లో ఉంటుందని సచివాలయ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు పదవికి గండం వచ్చి పడటంతో ఆ బంధువే హడావుడి చేస్తున్నారంటున్నారు