ఓ వైపు ఏపీ బీజేపీ అధ్యక్ష కుర్చీ కిందకు నీళ్లు వచ్చాయని ప్రచారం జరుగుతూంటే మరో వైపు సోము వీర్రాజు హడావుడిగా జనంలోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పుడో.. రెండు, మూడు నెలల కిందట ఉత్తరాంధ్రలో అసంపూర్తిగా మిగిలిపోయిన ప్రాజెక్టుల కోసం రోడ్డెక్కుతానని విశాఖ వచ్చి ఉత్తరాంద్ర నేతలతో వీడియో కాన్ఫరెన్స్ పెట్టిన ఆయన ఈ ఎండల్లో ఆ యాత్ర చేయాలని నిర్ణయించారు. “ఉత్తరాంధ్ర జలం కోసం – జల పోరు యాత్ర” పేరుతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో అసంపూర్ణంగా నిలిచిపోయిన తాగు-సాగు నీటి ప్రాజెకులపై పోరుబాటను ప్రకటించారు.
ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఈ నెల 7,8,9 తేదీలలో యాత్ర నిర్వహించాలని నిర్ణయించారు. సోము వీర్రాజు నాయకత్వంలో ఈ యాత్ర సాగుతుంది. యాత్రకు దగ్గుబాటి పురందేశ్వరి జెండా ఊపుతారు. ఇక సోము వీర్రాజుకు సపోర్ట్‌గా ఉండజే సునీల్ ధేవధర్, జీవీఎల్ హాజరువుతారు. మిగిలిన వాళ్లలో ఎవరు.. ఎంత మంది హాజరవుతారన్నదానిపై స్పష్టత లేదు.టీడీపీ నుంచి..ఇతర పార్టీల నుంచిచేరిన వారిని సోము వీర్రాజు కోవర్టులుగా చూస్తారు.
వీరిలో చాలా మంది ఇటీవల ఆయనకు వ్యతిరేకంగా విజయవాడలో సమవేశం అయ్యారు. బీజేపీ ఏపీ అధ్యక్షునిగా సోము వీర్రాజు ఓ వర్గానికి మాత్రమే ప్రోత్సాహం ఇవ్వడం పదవి చేపట్టిన వెంటనే ఓ సామాజికవర్గం వారిని టార్గెట్ చేసిమరీ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం వంటివి చేయడం ఇప్పుడు ఆయనకు మైనస్‌గా మారింది. అందరు నేతలు సోము వీర్రాజు యాత్రకు హాజరైతే.. ఆయన మరికొన్నాళ్లు పదవిలో ఉంటారనే నమ్మకం ఏర్పడుతుంది.