వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేల్లో అత్యధికులు రెడ్డి సామాజికవర్గం వారు. రాయలసీమలో రిజర్వేషన్ కేటగిరీ తప్ప ఇతర సీట్లలో 80 శాతం ఒకే సామాజికవర్గం వారు. అనంతపురం జిల్లాలో రిజర్వుడు నియోజకవర్గాల నుంచి గెలిచిన మహిళల భర్తలు కూడా రెడ్డి సామాజికవర్గం వారే. ఇలాంటి సమీకరణాలతో వైసీపీ రెడ్డి నేతల ఆధిపత్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.కానీ మొదటి సారి మంత్రివర్గం ఏర్పాటు చేసినప్పుడు రెడ్డి సామాజికవర్గనేతలపై పెద్ద పీట వేయలేకపోయారు. రెడ్లకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని చెప్పాలనుకున్నారు. ఆ ప్రకారం రాయలసీమ నుంచి ముఖ్యమంత్రిగా తాను .. కర్నూలు నుంచి బుగ్గన, చిత్తూరు నుంచి పెద్దిరెడ్డిలకు మాత్రమే రెడ్డి సామాజికవర్గంలో చోటిచ్చారు.
ఇక బంధువు బాలినేనికి అవకాశం కల్పించారు. ఇంతే ఇక వేరే ఎవరూ లేరు. దీంతో అనేక సార్లు గెల్చిన .. పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేసిన రోజా లాంటి ఎమ్మెల్యేలు హర్ట్ అయ్యారు. వారందరికీ రెండో విడత చాన్సిస్తామని జగన్ బుజ్జగించారు. అయితే ఇప్పుడు ఎక్కడ చూసినా రెడ్డి సామాజికవర్గమే కనిపిస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. అదే సమయంలో వివిధ సామాజిక వర్గాలను రాజకీయంగా అవమానించారు.అవి ఆగ్రహంతో ఉన్నాయి. ఈ కారణంగా వారందరినీ బుజ్జగించనున్నారు, సామాజికవర్గాల వారీగా ప్రాధాన్యం కల్పించి.. కోపాన్ని తగ్గించాలని జగన్ అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. మంత్రి వర్గ కూర్పులో కీలక పాత్ర పోషిస్తున్న సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి బీసీ, ఎస్సీ, ఎస్టీలకు పెద్దపీట వేసేలా క్యాబినెట్లో మార్పులు ఉంటాయని ప్రకటించారు.
అంటే ఈ సారి కూడా రెడ్డి సామాజికవర్గానికి నాలుగు కన్నా ఎక్కువ ఉండవని.. వారిలోనూ పెద్దిరెడ్డి, బుగ్గనను కొనసాగిస్తే మరొక్క పదవే ఎవరికైనా ఇవ్వగలుగుతారు. ఇంకా ఎక్కువ ఇస్తే ఇతర వర్గాలకు న్యాయం చేయలేరు. రెడ్డి సామాజికవర్గం అసంతృప్తికి గురయితే మొదటికే మోసం వస్తుంది. మొదటి విడతలో న్యాయం చేయలేదని రెండో విడత వైపు చూస్తూంటే… అక్కడా అన్యాయం జరిగితే వారెలా స్పందిస్తారో చెప్పడం కష్టమే. మొత్తంగా జగన్ క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్నారని చెప్పుకోవచ్చు.