తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఈ క్రమంలో దూరమైన నేతల్ని దగ్గర తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా బీజేపీ నేత వివేక్ వెంకటస్వామికి రాజ్యసభ ఆఫర్ ఇచ్చి మరీ పార్టీలోల చేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. కాకా వెంకటస్వామి కుమారుడు వివేక్‌ను గత ఎన్నికల్లో టిక్కెట్ కూడా ఇవ్వకుండా అవమానించి బయటకు పంపేశారు. దీంతో ఆ ఎన్నికల్లో పోటీ చేయలేదు. కొంత కాలం తర్వాత బీజేపీలో చేరారు.
ఇప్పుడు బీజేపీలోప్రముఖ నేతగా ఉన్నారు. ఇటీవలి కాలంలో బీజేపీ బలోపేతం కావడంలో ఆయన పాత్ర కీలకం అని చెప్పుకోవచ్చు. ఈటల రాజేందర్ మొదట కాంగ్రెస్ లో చేరాలనుకున్నారు. కానీ ఆయన చివరికి బీజేపీలో చేరారు.దీనికి కారణం వివేకేనని బీజేపీ వర్గాలు చెబుతూంటాయి.హైకమాండ్ వద్ద తనకు ఉన్న పలుకుబడిని ఉపయోగించి ఈటలను పార్టీలో చేర్పించారు. ఆయనకు వీ6 మీడియా గ్రూప్ కూడా ఉంది. ఇది తెలంగాణ ప్రజల్లో మంచి ఆదరణ పొందింది. అయితే కొంత కాలంగా ఆయన అసంతృప్తిలో ఉన్నారని.. తాను ఎంత కష్టపడినా గుర్తింపు రావడం లేదన్న భావనలో ఉన్నారని టీఆరఎస్ అనుకూల మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
దానికి కొనసాగింపుగా అవమానించి పంపేసిన దానికి పరిహారంగా రాజ్యసభ సీటు ఇచ్చి గౌరవంగా ఆహ్వానం పలుకుతామని టీఆర్ఎస్ రాయబారం పంపినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ ఆఫర్‌పై వివేక్ ఎలా స్పందిస్తారన్న అంశంపై ఇంకా స్పష్టత లేదు. జూన్ లోపు రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. అప్పటి వరకూ చర్చోపచర్చలు జరిగే అవకాశం ఉందంటున్నారు.