మెగా కుటుంబానికి చెందిన జస్ట్ టిక్కెట్ సంస్థకు ఏపీ ఆన్ లైన్ టిక్కెట్ల కాంట్రాక్ట్ ఇవ్వడానికి అంతా సిద్ధమైంది. ఒకటో తేదీ నుంచి వారి వద్ద నుంచే ఇక ఏపీ వాసులు టిక్కెట్లు కొనాలనేలా ఉత్తర్వులు ఇవ్వబోతున్నారని ప్రచారం జరిగి మూడు రోజులైంది. జస్ట్ టిక్కెట్స్ సంస్థ ఎల్-వన్‌గా నిలిచిందని.. కాంట్రాక్ట్ పొందబోతోందని అధికారవర్గాలు కూడా అనధికారలీక్ ఇచ్చాయి.
విషయం ఇక్కడి వరకూ వచ్చిందంటే.. ప్రభుత్వానికి కూడా ఆ సంస్థకు కాంట్రాక్ట్ ఇవ్వడానికి అంగీకారమే అనుకోవాలి. కానీ ఉత్తర్వులు మాత్రం వెలువడలేదు. దీంతో ఏం జరుగుతోందన్న చర్చ టాలీవుడ్లో ప్రారంభమయింది. ఏపీ ఆన్ లైన్ టిక్కెట్ల కాంట్రాక్ట్ కోసం జస్ట్ టిక్కెట్స్‌తో పాటు మరో సంస్థ కూడా పోటీ పడుతోంది. ఆ సంస్థ జస్ట్ టిక్కెట్స్ కన్నా తక్కువ కమిషన్ తీసుకుంటామని రివర్స్ టెండరింగ్ వేసినట్లుగా ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఈ కారణంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేకపోతోందని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ రెండు సంస్థలతో చర్చలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.
అయితే టెండర్లను ఇలా చర్చలతో ఖరారు చేసే అవకాశం లేదు. నిబంధనల ప్రకారం ఎవరు తక్కువకు వస్తే వారికే ఖరారు చేయాలి. అది గిట్టుబాటు కాదనుకుంటే.. టెండర్లు రద్దు చేసి మళ్లీ టెండర్లు పిలవాలి. మరి ఇప్పుడు ప్రభుత్వం ఏం ఆలోచన చేస్తుందో కానీ.. ఇప్పటికైతే జస్ట్ టిక్కెట్ కు అప్పగిస్తూ ఉత్తర్వులు రాలేదు. అయితే టాలీవుడ్‌కు చెందిన వారికే ఆ టిక్కెట్ కాంట్రాక్ట్ వస్తే మంచిదని టాలీవుడ్ వర్గాలు కూడా భావిస్తున్నాయి.