తెలంగాణ కాంగ్రెస్‌లో ప్రస్తుతం రెండు పార్టీలు ఉన్నాయి. ఒకటి రేవంత్ అనుకూలం… మరొకటి వ్యతిరేకం. తెలంగాణ కాంగ్రెస్ నేతలందరితో రాహుల్ గాంధీ మరోసారి సమావేశం అవుతున్నారు. నిజానికిగత వారం ఓ సమావేశం జరిగింది. కానీ అది సభ్యత్వ నమోదు అంశంపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన సమావేశం. దీంతో పార్టీ అంతర్గత విషయాలను చర్చించడానికి పెద్దగా అవకాశం చిక్కలేదు. అదే సమయంలో తెలంగాణలో పార్టీ పరిస్థితులను చక్కదిద్దకపోతే మొదటికే మోసం వస్తుందని రాహుల్ ఓ నిర్ణయానికి వచ్చారు. ముందుకు వెళ్తున్న రేవంత్‌ను వెనక్కి లాగేందుకు సీనియర్ల పేరుతో కొందరు చేస్తున్న ప్రయత్నాలు గీత దాటుతున్నాయి.పార్టీ ప్రయోజనాలకు భంగం కలిగిస్తున్నాయి.
జగ్గారెడ్డి, వీహెచ్ వంటి నేతలు అదే పనిగా మీడియాముందుకు వచ్చి పార్టీని మరింతగా చులకన చేస్తున్నారు. ఈ క్రమంలో అందరితో సమావేశం అవ్వాలని రాహుల్ నిర్ణయించారు. వీహెచ్ తో పాటు జగ్గారెడ్డి … అసంతృప్తితో ఉన్న సీనియర్లు.. పార్టీ పదవుల్లో ఉన్న వారందరినీ సమావేశానికి పిలిచారు. ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై స్పష్టమైన అవగాహనతో ఉన్న రాహుల్… వారు చెప్పేదాని కన్నా.. తాను చెప్పేదానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి తీరుపై ఈ సమావేశంలో జగ్గారెడ్డి, వీహెచ్ వంటి వారు ఫిర్యాదులు చేసే అవకాశాలు ఉన్నాయి. వాటిపై రాహుల్ ఎలా స్పందిస్తారన్నదానిపై సీనియర్ల వ్యవహారశైలి ఆధారపడి ఉండే అవకాశం ఉంది.
సీనియర్ల మాటలు ఆలకించి.. రేవంత్ రెడ్డికి ఏమైనా సలహాలు అప్పటికప్పుడు రాహుల్ ఇస్తే దీన్నే అడ్వాంటేజ్‌గా తీసుకునేందుకు ఆ నేతలు వెనుకాడరు. అలా కాకుండా.. సీనియర్ నేతలకు రాహుల్ రివర్స్‌లో హెచ్చరికలు ఇస్తే వారు సైలెంట్ అయ్యే అవకాశం ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇలా రేవంత్ అనుకూల.. వ్యతిరేక వర్గాలుగా ఉండాలా లేదా అన్నది రాహుల్ గాంధీ సమావేశంలో తేలిపోయే చాన్స్ ఉంది.