పేకాట ఆడుతూ కర్ణాటక పోలీసులకు దొరికిపోయిన పీఏను బాలకృష్ణ ఏమి అనకపోయినా ప్రభుత్వం మాత్రం ఊరుకోలేదు. ఆయనను మళ్లీ మాతృశాఖకు బదిలీ చేసింది. బాలకృష్ణ కు పీఏ గా వ్యవహరిస్తున్న బాలాజీ డిప్యూటేషన్ రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బాలాజీ
ఇటీవల కర్ణాటక సరిహద్దులోని బార్ అండ్ రెస్టారెంట్ లో పేకాట ఆడుతూ పట్టుబడ్డారు. వైఎస్ఆర్సీపీ స్థానిక నేతలతో కలిసి ఆయన పొరుగు రాష్ట్రానికి వెళ్లి ్మరీ పేకాట ఆడుతున్నారు. అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. తర్వాత బెయిల్ పై విడుదలయ్యారు.
బాలాజీ ప్రభుత్వ ఉద్యోగి. మామూలుగా అయితే ఆయన ఉపాధ్యాయుడు. ఆ తర్వాత బాలకృష్ణ వద్ద పీఏగా చేరాడు. చాలా రోజుల నుంచి బాలకృష్ణ పీఏగా నియోజకవర్గంలో వ్యవహారాలు చక్క బెడుతున్నారు. బాలకృష్ణ స్థానికంగా ఇల్లు తీసుకున్నప్పటికీ ఎక్కువగా ఉండరు. ఎమ్మెల్యే తరపున వ్యవహారాలన్నీ బాలాజీనే చక్క బెడుతూ ఉంటారు. దీంతో ఆయన ఎమ్మెల్యే ప్రతినిధిగా వ్యవహరిస్తూ ఉంటారు. ఇలాంటి బాధ్యతాయుతమైన పదవిలో ఉండి కూడా వైఎస్ఆర్సీపీ నేతలతో కలిసి పొరుగు రాష్ట్రంలో పేకాడుతూ దొరికిపోవడం కలకలం రేపింది.
అయితే ఆయన అలా దొరికిపోయినప్పటికీ బాలకృష్ణ స్పందించలేదు. ఆ తర్వాత బాలాజీ యధావిధిగా పీఏగా పనులు చక్క బెడుతూ వస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ఆయనను అక్కడ కొనసాగించడానికి సిద్ధంగా లేదు. దీంతో డిప్యూటేషన్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఆయన ఎమ్మెల్యే పీఏ గా కొనసాగేందుకు వీలు ఉండదు. టీచర్‌గా విధులు నిర్వహించాల్సి ఉంటుంది.