అధికారం కోసం అధికార పార్టీపై పోరాడాల్సింది పోయి తమలో తము పోట్లాడుకుంటున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలకు రాహుల్ గాంధీ క్లాస్ పీకారు. అందర్నీ పిలిచి.. ఎవరైనా పార్టీ లైన్ గీత దాటడం కానీ… టీఆర్ఎస్ నేతలతో సాఫ్ట్‌గా ఉండి..పార్టీకి నష్టం చేసేలా వ్యవహారిస్తే ఊరుకునేది లేదని స్పష్టమైన వార్నింగ్ ఇచ్చారు. టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశానికి సీనియర్లు .. అసంతృప్తి వాదులు అందరూ హాజరయ్యారు. అందరికీ తమ తమ అభిప్రాయాలు చెప్పే అవకాశం ఇచ్చారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిపై ఎక్కువ మంది ఫిర్యాదులు చేయలేదని తెలుస్తోంది.
కాంగ్రెస్ హైకమాండ్ .. రేవంత్ రెడ్డి విషయంలో సానుకూలంగా మరీ అతి ఫిర్యాదులు చేయడానికి ముందూ వెనుకాడినట్లుగా తెలుస్తోంది. రాహుల్ గాంధీ తన వరకూ చాలా టైం తీసుకుని చెప్పాలనుకున్నది సూటిగా.. స్పష్టంగా చెప్పినట్లుగా తెలుస్తోంది. ఏమైనా ఉంటే బహిరంగంగా మాట్లాడవద్దని వేణుగోపాల్‌కు చెప్పాలని.. ఆ తర్వాత తన వద్దకు రావాలని రాహుల్ స్పష్టం చేశారు. భేటీ తర్వాత జగ్గారెడ్డి తాను గతంలో చేసిన రాజీనామాను వెనక్కి తీసుకుంటున్నానని గతంలో ఏం మాట్లాడానో గుర్తు లేదని చెప్పుకొచ్చారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమావేశానికి హాజరైనా… ఆయన సోదరుడు రాజగోపాల్ రెడ్డి మాత్రం రాలేదు. ఆయనకు ఆహ్వానం ఉన్నప్పటికీ రాలేదని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
సమావేశంలో దాదాపుగా అందరూ ఐక్యంగానే ఉంటేనే విజయం సాధ్యమని అంగీకరించారు. ఆ దిశగా ప్రయత్నిస్తామని హామీ కూడా ఇచ్చారు. ఇప్పుడుమళ్లీ అందరూ క్షేత్ర స్థాయికి చేరారు. రాహుల్‌కు హామీ ఇచ్చిన ఐక్యతను కొనసాగిస్తారా లేక.. మూడు నాళ్ల ముచ్చటగా మార్చుకుని మళ్లీ కలహించుకుంటారా అన్నది వేచిచూడాలి. కాంగ్రెస్ నేతల్లో ఐక్యత వచ్చి అందరూ కలసి పోరాడితే.. కాంగ్రెస్ పార్టీకిగత వైభవం ఉంటుందని ఆశపడుతున్నారు. మరి కాంగ్రెస్ నేతలు ఏం చేస్తారో ?