జనసేన అధినేత పవన్ కల్యాణ్ మంగళవారం పూర్తిస్తాయి కార్యవర్గ సమావేశానికి పిలుపునిచ్చారు. పార్టీలోని అన్ని వ్యవస్థలూ ఈ సమావేశంలో భాగం అవుతాయి. ఎన్నికల మూడ్ వచ్చినందున పార్టీని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే అంశంపై సుదీర్ఘమైన చర్చలు జరపే అవకాశం ఉంది. అలాగే పొత్తుల అంశంపైనా అందరి నుంచి అభిప్రాయాలు తెలుసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతానికి పొత్తుల కన్నా ప్రభుత్వంపై పోరాటంపైనే ఎక్కువ దృష్టి పెట్టే ఆలోచన ఉంది. ప్రజావ్యతిరేకత చాలా స్పష్టంగా కనిపిస్తున్నందున దాన్ని ఎలా పార్టీ బలోపేతం కోసం మళ్లించుకోవాలా అన్నది జనసేన పార్టీ నేతల ఆలోచన .
ప్రస్తుతం విద్యుత్ చార్జీల పెంపు విషయంపై ఏపీలో తీవ్రమైన చర్చజరుగుతోంది. అన్నీ పెరుగుతున్నాయి.. దాంతో పాటు విద్యుత్ చార్జీలు పెరిగాయని వైసీపీ నేతలు, అధికారులు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు కానీ.. గతలో జగన్ చెప్పిన దానికి ఇప్పుడు చేస్తున్న దానికి పొంతన లేకపోవడం ఎక్కువగా ప్రజల్లో చర్చ జరుగుతోంది. గత ప్రభుత్వంలో చార్జీల పెంపులేకపోయినా బాదుడే బాదుడంటూ ప్రచారం చేసి ఇప్పుడు అదేపనిగా రేట్లు పెంచుతూ పోవడం మాట తప్పడమేనని.. జగన్‌కు పాలన చేత కాదన్న అభిప్రాయం ప్రజల్లో బలపడేలా ఉండటంతో పవన్ కల్యాణ్ అడ్వాంటేజ్‌గా తీసుకోవాలని భావిస్తున్నారు. మంగళవారం సమావేశంలో ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించే అవకాశం ఉంది. కార్యాచరణ కూడా ఖరారు చేసే చాన్స్ ఉంది.
అయితే పవన్ కల్యాణ్ ప్రత్యక్షంగా ఉద్యమాల్లో పాల్గొనకుండా.. కేవలం పిలుపునిచ్చి క్యాడర్ మాత్రమే యుద్ధం చేయాలంటే… మొదట్లోనే వీక్ అయిపోతుంది. పవన్ కల్యాణ్ రోడ్లపై ఉంటేనే ప్రయోజనం ఉంటుంది. ప్రస్తుతం పవన్ తీరిక లేకుండా సినిమాలు అంగీకరించారు. ఆయన కాల్షీట్ల డైరీలో చాలా తక్కువ ఖాళీలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో జనసేన పార్టీకి ఎంత సమయం కేటాయిస్తారనేది ఇప్పుడు కీలకంగా మారింది. పవన్ ఎంత ఎక్కువ సమయం కేటాయిస్తే.. జనసేన కు అంత ఊపొస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.