ఏపీ అంటే అప్పుల కుప్ప. అప్పు దొరికినప్పుడు మాత్రమే జీతాలిస్తారు. కానీ తెలంగాణకు ఏమయింది..? ధనిక రాష్ట్రం. కానీ ఉద్యోగులకు జీతాలు మాత్రం రాలేదు. ఒక్కహైదరాబాద్ ప్రాంతంలో పనిచేసేవారికి మాత్రం జీతాలు అందాయి. మిగిలిన వారికి ఎదురు చూపులే కనిపిస్తున్నాయి. ఐదోతేదీన బ్యాంకులకు సెలవు కావడంతో ఈ రోజు కూడా జీతాలు అందే పరిస్థితి లేదు. ఖజానాలో నిధులంటే కేసీఆర్ నెలలో ఒక రోజు ముందే జీతాలిస్తారు. ఇప్పుడు ఇవ్వడం లేదంటే.. ఖజానాల్లో డబ్బుల్లేవని అర్థం. ఇలాంటి పరిస్థితి ఎందుకొచ్చిందో ఉద్యోగులకు కూడాఅంతుబట్టడం లేదు.
తెలంగాణ ఆర్థిక కష్టాల్లో ఉందని ఎవరూ అనుకోవడం లేదు. కానీ గత కొన్నాళ్లుగా జీతాలు ఒకటో తేదీన ఇవ్వడం లేదు. సచివాలయంతో పాటు హైదరాబాద్లో పని చేసే వారికి మాత్రం ఒకటో తేదీకి జీతాలిస్తున్నారు. తర్వాత జిల్లాల వారీగా చూసుకుంటూ పోతే.. పదో తేదీ తర్వాత జీతాలు ఇస్తున్న సందర్భాలు ఉన్నాయి. అయితే పెద్దగా బయటకు తెలియడం లేదు. తెలంగాణ ప్రభుత్వానికి ఆదాయం విపరీతంగా పెరుగుతోంది. అయినప్పటికీ ప్రభుత్వం దళిత బంధు లాంటి కొత్త స్కీముల్ని ప్రవేశ పెట్టి ప్రజల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేయడం ద్వారా ఆర్థిక వెసులుబాటు దక్కించుకోలేకపోతోంది. ఫలితంగా సమస్యల్లో కూరుకుపోయినట్లుగా కనిపిస్తోంది.
ఏపీతో పోలిస్తే పరిస్థితి చాలా మెరుగ్గా ఉందని తెలంగాణ అధికారులు చెబుతున్నారు. ఆదాయం భారీగా పెరుగుతోందని అదే సమయంలో రుణాల చెల్లింపులకూ ఇబ్బందిలేదని గుర్తు చేస్తున్నారు. జీతాల చెల్లింపులకు తాత్కాలిక సర్దుబాట్లు ఆలస్యం కావడం.. గత ఆర్థిక సంవత్సరం ముగింపు సందర్భంగా బిల్లుల చెల్లింపులకు అత్యధికంగా ఖర్చుచేయాల్సి రావడంతో సమస్య వచ్చినట్లుగా భావిస్తున్నారు. కారణం ఏదైనా… తెలుగు రాష్ట్రాల ఉద్యోగులకు ఏదీ కలసి రావడం లేదని అనుకోవాలి.