దేశం బాగుండాలంటే పాలకులు బాగుండాలి. వ్యక్తిగత స్వార్థం కోసం పరిపాలన చేసి .. పప్పు బెల్లాలు పంచేసి బతికినంత కాలం బాగానే ఉంటుంది , కానీ ఒక్క సారిగా పరిస్థితి తలకిందులయితే ఇబ్బంది పడేది ప్రజలే. పాలకులు కాదు. పాలకులు చేసిందతా చేసేసి తమ దారి తాము చూసుకుంటారు. వారికి పోయేదేమీ లేదు. ప్రస్తుతం శ్రీలంకలో అదే పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం అక్కడి రాజకీయ నేతలందరూ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నారు. శ్రీలంకను బాగు చేయడం … ప్రజల అవసరాలు తీర్చడం తమ వల్ల కాదు అని అందరూ డిసైడైపోతున్నారు. సంక్షోభ సమయంలో దేశాన్ని గట్టెక్కించడానికి ఏమైనా చేయాల్సిన మంత్రులు, ఎంపీలు తమ పదవులకు రాజీనామాలు చేస్తున్నారు.
స్వార్థ పాలనలతో శ్రీలంక పుట్టి ముంచిన రాజకీయ నేతలు !
ప్రస్తుత ప్రభుత్వమే కాదు.. గత ప్రభుత్వంకూడా శ్రీలంకలో ఈ దుస్థితికి కారణం. ఎన్నికల్లో గెలుపు కోసం ఒకరికి మించి ఒకరు ఆర్థిక విధ్వంసానికి పాల్పడటమే కాక… ఇష్టారీతిన అప్పులు చేసి.. అనుత్పాదక వ్యయం చేశారు. ఇప్పుడు అప్పుల కుప్పలా మారిన శ్రీలంకకు కొత్త అప్పులు ఎవరూ ఇవ్వకపోగా పాత అప్పులు గుండెల మీద కుంపటిలాగాఉన్నాయి. అడిగినప్పుడల్లా అప్పులు ఇచ్చి.. శ్రీలంకకు ఈ పరిస్థితి రావడానికి కారణం అయిన చైనా.. చైనాను సమర్థిస్తూ పరిపాలించిన పాలకులు ఇప్పుడు అస్త్ర సన్యాసం చేస్తున్నారు. తమ ప్రజల గురించి ఆలోచించడం లేదు.
తమ దారి తాము చూసుకుంటున్న రాజకీయ నేతలు !
శ్రీలంక ప్రజలు ఇప్పుడు తిండి తిప్పలులేక అల్లాడిపోతున్నారు. ఆ దేశం పూర్తిగా దిగుమతులపై ఆధారపడుతోంది. ఇప్పుడు దిగుమతలకుపైసా డబ్బు లేదు. పెద్దఎత్తున అప్పులుఉన్నాయి. దేశాన్ని చక్కదిద్దాలంటే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. కానీ ఈ దుస్థితికి తెచ్చిన పాలకులు ఒక్కొక్కరు వదిలి పెట్టి తమ దారితాము చూసుకుంటున్నారు. కొంత మంది విదేశాలకు వెళ్లిపోతున్నారు. అధికారం అనుభవించినంత కాలం వారు బాగానే ఉన్నారు. కానీ దేశం దివాలా తీసేసరికి అంతా జెండా ఎత్తేస్తున్నారు. ప్రజలు మాత్రం రోడ్డున పడి… ఏడుస్తున్నారు.
గుణపాఠం నేర్పుతున్న ఆకలితో అలమటిస్తున్న శ్రీలంక ప్రజలు !
రాజకీయ నేతలు అందంరూ బాగున్నారు. వారికి ఉచిత పథకాలు ఇచ్చిన వారు బాగున్నారు. ప్రజల కోసమే అంటూ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిన వారికి ఇరవై నాలుగు గంటల కరెంట్ వస్తుంది. మిగిలిన వారు జెండా ఎత్తేసివెళ్లిపోయారు. కానీ ప్రజలు మాత్రమే నరకం చూస్తున్నారు. వారి పరిస్థితి ఇప్పుడల్లా మెరుగుపడదు. ఎంత మంది నిపుణులైన పాలకులు వచ్చినా జరిగిపోయిన విధ్వంసాన్ని మళ్లీ కరెక్ట్ చేయడానికి సమయం పడుతుంది. అప్పటి వరకూ ప్రజలు అనుభవించాల్సిందే. బాధ్యత లేని పాలకుల్ని ఎన్నుకున్న శ్రీలంక ప్రజలు అనుభవిస్తున్న వేదన ఓటు వేసే ప్రతి ఒక్క ఓటర్కు గుణపాఠం లాంటిదని అనుకోవచ్చు.