ఉమ్మడి రాజధాని హైదరాబాద్ పేరుతో ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల మధ్య జరుగుతున్న రచ్చను చూస్తూనే ఉన్నాం. అయితే ఏపీ పాలన గతంలోనే ఏపీకి వెళ్లిపోవడంతో రెండు రాష్ట్రాల మధ్య ఓ పెద్ద పంచాయతీకి ముందుగానే తెరపడింది. కానీ పంజాబ్ – హర్యానా మధ్య ఇప్పుడు అలాంటి రాజధాని పంచాయతీ వచ్చేసింది. రెండు రాష్ట్రాలకు ఒకే రాజధాని ఉంది.అదే చండిగఢ్. రెండు ప్రభుత్వాలూ అక్కడి నుంచే నడుస్తాయి. అందుకే ఆ ప్రాంతాన్ని కేంద్ర పాలిత ప్రాంతం చేశారు.
కేంద్ర పాలిత ప్రాంతంలో పని చేస్తున్న ఉద్యోగుల విషయంలో ఇటీవల కేంద్రహోంమంత్రి అమిత్ షా కొన్ని కొత్త రూల్స్ తీసుకు వచ్చారు. ఇవి పంజాబ్ కొత్త సీఎం భగవంత్ మన్ కు నచ్చలేదు. వెంటనే చండిఘడ్ను తమకు బదిలీ చేయాలని ఆయన తీర్మానం చేసేశారు. ఇక హర్యానా మాత్రం ఊరుకుంటుందా ? పైగా అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉంది. ఇక వెంటనే రివర్స్ తీర్మానం చేశారు. . అంటే రెండు రాష్ట్రాల మధ్య పంచాయతీ ప్రారంభమైనట్లేనని అనుకోవాలి.
ఇక్కడ బీజేపీ రాజకీయం చాలా చురుగ్గా ఉందని అనుకోవాలి ఎందుకంటే.. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ .. హర్యానాకు చెందిన వ్యక్తి. ఈ అంశాన్ని చండిఘడ్ విషయంలో ఆ పార్టీ తీరును ఇటు హర్యానాలో సెంటిమెంట్ గా మార్చి.. అక్కడ కూడా బలపడకుండా చేయడం.. అదే సమయంలో పంజాబ్లో హర్యానా వ్యక్తి నేతృత్వంలోని పార్టీతో పంజాబ్ ప్రయోజనాలు కాపాడలేరన్న అభిప్రాయాన్ని కల్పించే లక్ష్యంగా ఈ రాజకీయం ప్రారంభమైనట్లు ఇప్పటికే విశ్లేషణలు వస్తున్నాయి.