కొత్త జిల్లాలు అందుబాటులోకి వచ్చాయి. కానీ వైసీపీ నేతల్లో ఎక్కడా సందడి కనిపించలేదు. వారిలో ఏదోతెలియని ఆందోళన కనిపిస్తోంది. పూర్తి స్థాయిలో సంబరాలు చేసుకోలేకపోతున్నారు. దీనికి కారణం జిల్లాల విభజనను ఇంత హడావుడిగా చేపట్టాల్సిన అవసరం ఏముందన్న అభిప్రాయం ఒకటి తో పాటు జిల్లాల పేరు చెప్పి రిజిస్ట్రేషన్ల చార్జీలను వెంటనే పెంచేయడం మరో కారణం అనుకోవచ్చు. తెలంగాణలో ఏమో కానీ.. ఏపీలో మాత్రం జిల్లాలతో అందరికీ ఓ మానసికమైన అనుబంధం ఉంది. ప్రతి ఒక్కరికీ ఓ ఎమోషన్ ఉంటుంది. మాది కర్నూలు జిల్లా.. మాది గుంటూరు జిల్లా.. మాది సిక్కోలు జిల్లా అని గర్వంగా చెప్పుకునేవారు. ఇలా ప్రతి జిల్లాతోనూ అనుబంధం ఉంది.
అదే సమయంలో ప్రజల్లో జిల్లాలు కావాలన్న డిమాండ్ కానీ సెంటిమెంట్ కానీ లేదు. జిల్లాలు చిన్నగా అయితే ఎలాంటి ప్రయోజనం కలుగుతుందో కూడాజనానికి స్పష్టత లేదు. ఇప్పుడు కొత్త జిల్లాల వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువ అన్న ప్రచారం మాత్రం ఉద్ధృతంగా సాగుతోంది. కొత్త జిల్లాల్లో ఎలాంటి మౌలిక సదుపాయాలు లేవు. తాత్కాలిక భవనాలు..పాత భవనాల్లో పాలన ప్రారంభించారు. కనీసం కుర్చీలకు కూడా డబ్బుల్లేని పరిస్థితి. ఇక్కడ పాలన సాగాలాంటే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముందు ముందు ఈ సమస్యలు భరించాల్సింది ఎమ్మెల్యేలే. అదే సమయంలో కొత్త జిల్లాల విభజనతో దాదాపుగా ప్రతి జిల్లాలోనూ జిల్లా కేంద్రం దూరమైన సమస్యలు ఉన్నాయి.
కొన్ని అంశాల్లో ప్రజల డిమాండ్లను పట్టించుకోలేదు. అవి ఎమ్మెల్యేలకు భారంగా మారాయి. ఇప్పటికిప్పుడు.. జిల్లాలను విభజించి కొత్త సమస్యలు నెత్తికెత్తుకున్నామేమో అన్న భావనలో ఎక్కువ మంది ఉన్నారు. ఎన్నికల్లోపు ప్రజలకుఇబ్బందులు కలగకుండా ఉంటే చాలని లేకపోతే ఉన్న సమస్యలకు తోడు.. కొత్తగా ఇవి కూడా ఓటర్లపై ప్రభావం చూపిస్తే మొదటికే మోసం వస్తుందని ఆందోళన చెందుతున్నారు.