తెలంగాణ గవర్నర్ ప్రధాని మోదీతో భేటీ తర్వాత ఢిల్లీలో చేసిన వ్యాఖ్యలతో ఇక తెలంగాణలోనూ బెంగాల్ రాజకీయం రిపీటవబోతోందని నిర్ణయానికి వచ్చేశారు. అక్కడ గవర్నర్.. మమతా బెనర్జీపై విరుచుకుపడుతూంటారు. సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతూ ఉంటారు. ప్రస్తుతం తెలంగాణ గవరనర్నుకేసీఆర్ గుర్తించడం లేదు. ఎక్కడికీ ఆహ్వానించడం లేదు. ఆహ్వానించినా వెళ్లడం లేదు. ఫలితంగా తమిళిశై కూడా తాను తల వంచే ప్రశ్నే లేదని ప్రకటించారు. బీజేపీయేతర రాష్ట్రాల ప్రభుత్వాలు ఉన్న చోట్ల గవర్నర్లు ఎలా వ్యవహరిస్తారో ప్రత్యేకంగా ఉదాహరణలు చెప్పాల్సిన పని లేదు. కాంగ్రెస్ ఉన్నప్పుడు కర్ణాటకలో గవర్నర్ వ్యవహరించిన తీరు ఇంకా కళ్ల ముందు ఉంది. అదే సమయంలో ప్రస్తుతం బెంగాల్ గవర్నర్ వ్యవహరిస్తున్న తీరు.. తమిళనాడు గవర్నర్.. స్టాలిన్ ప్రభుత్వంతో తలపడేందుకు చేస్తున్న ప్రయత్నాలు రోజూ చర్చనీయాంశం అవుతూనే ఉన్నాయి.
వారితో పోలిస్తే తెలంగాణ గవర్నర్ అసలు ఏమీ వివాదాస్పదం చేయడం లేదని అనుకోవచ్చు. ఎందుకంటే బెంగాల్లో తానే ప్రభుత్వం అన్నట్లుగా అక్కడి గవర్నర్ మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రితో మాటల యుద్ధానికి దిగుతున్నారు. తెలంగాణలో అలాంటి పరిస్థితులు లేవు. చాలా రకాలుగా తమిళిశై ప్రజాస్వామ్య బద్దంగా వ్యవహరిస్తున్నారని అనుకోక తప్పదు.ఇక తాను చేయాలనుకున్నది చేస్తానని గవర్నర్ ప్రకటించారు. మే నుంచి ప్రజాదర్భార్లు నిర్వహిస్తానని ప్రకటించారు. ఇప్పుడు ఆమెలోనూ పట్టుదల పెరిగే అవకాశం ఉంది. కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇబ్బందిపెడితే ఆమెకు కేంద్రం నుంచి సపోర్ట్ వస్తుంది కానీ నిరుత్సాహం రాదు. ఆ విషయం తాజాగా మోదీతో భేటీ తర్వాత క్లారిటీ వచ్చేసింది. అందుకే ఇప్పుడు ఆమె తానేంటో చూపించాలనుకుంటున్నట్లుగా మాటలను బట్టి అర్థం చేసుకోవచ్చు.
నిజంగా గవర్నర్ తమిళిశై అలా మారిపోతే.. పూర్తిగా కేసీఆరే అందుకు కారణం అనుకోక తప్పదు. అయితే కేసీఆర్ రాజకీయంగా చాణక్యుడిలాంటి వారని ఏమీ తెలియకుండా ఆయన ఉద్దేశపూర్వంగా గవర్నర్తో వైరం పెంచుకోరని భావించవచ్చు. గవర్నర్ ప్రాధాన్యం తెలుసుకాబట్టే గతంలో నరసింహన్తో కేసీఆర్ అంత చనువుగా వ్యవహరించారు. కానీ ఇప్పుడు మాత్రం నరసింహన్తో చంద్రబాబు వ్యవహరించినట్లుగా వ్యవహరిస్తున్నారు.