వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తు కోసం ఏడాదిన్నరగా కడపలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్లో ఉంటున్న సీబీఐ అదికారులకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఆ గెస్ట్ హౌస్ ఖాళీ చేసి వెళ్లిపోవాలని సూచించింది. ఇప్పటికే చాలా కాలం ఉన్నారని.. ఇక ముందు చాలా పనులు ఉన్నాయని అధికారులు సీబీఐ అధికారులకు తేల్చి చెప్పారు. త్వరలో శ్రీరామనవమి పండుగ ఉందని.. ఒంటిమిట్ట ఆలయంలో శ్రీరాముల వారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి సీఎం జగన్ వస్తున్నారని.. ఈ సందర్భంగా గదులు అవసరం అందుకే ఖాళీ చేయాలని తాజా కారణం చెప్పారు.
సీబీఐ అధికారులు ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ ఖాళీ చేస్తారో లేకపోతే.. తమ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి… ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తారో స్పష్టత లేదు కానీ.. సీబీఐ విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి మాత్రం చర్చనీయాంశం అవుతోంది. గతంలో సీబీఐ అధికారులపైనే కేసులు పెట్టారు. హైకోర్టు నిలిపివేయడంతో సరిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో సీబీఐ అధికారులు దర్యాప్తు ఎలా చేస్తున్నారో కూడా స్పష్టత రావడం లేదు.
కేసులో చార్జిషీట్ల అంశం హైలెట్ అయింది. ఇదిగో నేడో రేపో అవినాష్ రెడ్డిని ఆయనతండ్రిని అరెస్ట్ చేస్తారన్న ప్రచారం జరిగి కూడా నెల దాటిపోయింది. కానీ సీబీఐ అధికారులు కొత్తగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ఏదో జరుగుతోందన్న అభిప్రాయం అంతటా వినిపిస్తోంది. సీబీఐ అధికారులు మళ్లీ సైలెటంయ్యారు. ఇలా ఎందుకు ఆగి.. ఆపి విచారణ చేస్తున్నారో.. నిందితుల్ని కనిపెట్టినప్పుడు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. కానీ సమాధానం మాత్రం ఎ వైపు నుంచీ రావడం లేదు.