ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతల గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. వాలంటీర్లకు సన్మాన కార్యక్రమం పెట్టి అందులో ప్రసంగించిన ప్రతిపక్ష నేతలపై విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో మాట్లాడుతూ తన పాలనపై.., పథకాలపై అసూయపడుతున్నారని.. అసూయ ఎక్కవైతే గుండెపోటు రావొచ్చు.. త్వరగా టిక్కెట్ తీసుకోవచ్చు అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. సీఎం జగన్ ప్రతిపక్ష నేతల చావును కోరుకుంటున్నారన్న విమర్శలు సోషల్ మీడియాలో వస్తున్నాయి.
మంచి వ్యక్తిగా పేరున్న మంత్రి గౌతం రెడ్డి ఇటీవలే గుండెపోటుతో మరణించారు. కొంత మంది జగన్మోహన్ రెడ్డి మాటలను గౌతంరెడ్డి మరణానికి లింక్ పెడుతున్నారు. జగన్ మాటల ప్రకారం గౌతంరెడ్డి అసూయ ఎక్కువై చనిపోయారా అని ప్రశ్నిస్తున్నారు. ఈ అంశంపై నారా లోకేష్ కూడా స్పందించారు. అసూయ కి అన్న లాంటి వాడు జగన్మోహన్ రెడ్డి అని.. అందుకే నాన్న, బాబాయ్ కి టికెట్ తీసి పంపేసాడని ఈ సారి గుండెపోటు తల్లికో! చెల్లికో? అనే అనుమానాన్ని లోకేష్ వ్యక్తం చేశారు.
ఇటీవలి కాలంలో జగన్మోహన్ రెడ్డిలో అసహనం పెరిగిపోతోందన్న అభిప్రాయం వినిపిస్తోంది. అసూయతో పాలన చేస్తున్నారని విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. అసూయకారణంగానే అమరావతి సహా అన్నింటినీ ఆపేశారని.. ఏపీని దివాలా తీయించారని ఆరోపిస్తున్నాయి. మరో వైపు ఏపీ అప్పుల్లో కూరుకుపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లోనూ ప్రజల కోసం పోరాడుతున్న ప్రతిపక్ష నేతల్ని చనిపోతారన్నట్లుగా జగన్ వ్యాఖ్యలు చే్యడం దుమారంరేపుతోంది. ఆయన నైజం అలాంటిదేనన్న చర్చ సోషల్ మీడియాలో ప్రారంభమయింది..