తెలంగాణలో గవర్నర్ వర్సెస్ ప్రభుత్వం అనే రాజకీయం నడుస్తోంది. గవర్నర్ రాజకీయం చేస్తున్నారని టీఆర్ఎస్ అంటోంది. తాను ఎక్కడ రాజకీయం చేశానో చెప్పాలని గవర్నర్ అడుగుతున్నారు. ఇప్పుడు రాజకీయం చేయాలని ఆమె డిసైడయ్యాేమో కానీ ఢీల్లీలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆ ఒరవడి ఆమె కొనసాగిస్తుందని భావిస్తున్నారు. అలా చేయాలనుకుంటే గవర్నర్ చేతికి ఏ గవర్నర్‌కూ ఉండని ఓ ఆయుధం ముందుగానే లభిస్తుంది. అదే సెక్షన్ 8.
హైదరాబాద్ పదేళ్ల పాటు ఉమ్మడి రాజధాని. పదేళ్ల పాటు… హైదరాబాద్‌కు సంబంధించిన అంశాల్లో.. గవర్నర్‌కు విశేషాధికారాలు కల్పిస్తూ.. విభజన చట్టంలో సెక్షన్ 8ను చేర్చారు. ఈ అధికారాలను గతంలో గవర్నర్ నరసింహన్ వాడుకునే ప్రయత్నం చేశారు కానీ.. కేసీఆర్ వాటిని చాకచక్యంగా ఆపేయగలిగారు. తర్వాత చంద్రబాబు.. సెక్రటేరియట్‌ను అమరావతికి మార్చుకోవడంతో.. సెక్షన్ 8 అనే పదానికి దాదాపుగా ముగింపు వచ్చేసినట్లయింది. ప్రస్తుత గవర్నర్ తమిళిసై కూడా ఆ సెక్షన్ ఎయిట్ గురించి ఇప్పటి వరకూ పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు పట్టించుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి.
సెక్షన్ 8 ప్రకారం హైదరాబాద్‌లో ప్రభుత్వం ఎలాంటి కీలక నిర్ణయం తీసుకోవాలన్న గవర్నర్ అనుమతి తీసుకోవాలి. సెక్షన్ 8 అంశం పూర్తిగా గవర్నర్ అధికారాలకు సంబంధించినది. ఇప్పుడు గవర్నర్.. ఆ సెక్షన్ ను ఉపయోగించుకోవాలని అనుకుంటే ప్రభుత్వానికి చిక్కులు తప్పవు. గతంలో సెక్రటేరియట్ భవనాలు కూల్చేసేటప్పుడు ఈ అంశంపై చర్చ జరిగింది. కాంగ్రెస్ నేతలు ఈ సెక్షన్ ను ఉపయోగించుకోవాలని గవర్నర్‌ను కోరారు. అప్పుడు తమిళిశై పట్టించుకోలేదు. ఇప్పుడు అవసరం వచ్చింది కాబట్టి రంగంలోకి దిగుతారేమో చూడాలి. అదే జరిగిదే.. తెలంగాణ రాజకీయం మరింత రసవత్తరంగా మారుతుంది.