హిందీ భాషను జాతీయ భాషగా మార్చాలనుకుంటున్నట్లుగా అమిత్ షా చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఇంగ్లిష్కు ప్రత్యామ్నాయం హిందీ భాష అని ప్రజలందరూ హిందీ నేర్చుకోవాలని కేంద్ర హోంశాఖ మంత్రి చేసిన ప్రకటన మరోసారి రాజకీయ విమర్శలకు కారణం అవుతోంది. పార్లమెంటరీ అధికార భాషా కమిటీ సమావేశంలో అమిత్ షా హిందీ పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకే దేశం.. ఒకే భాష అన్న పద్దతిలో అమిత్ షా వ్యాఖ్యలు ఉండటంతో విమర్శలు ప్రారంభమయ్యాయి.
మన దేశంలోని ప్రజలు ఏం తినాలో, ఏం ధరించాలో, ఎవరిని ప్రార్థించాలో, ఏ భాషా మాట్లాడాలో ప్రజల నిర్ణయానికే వదిలేయాలి. దేశంలో ఏ భాష మాట్లాడాలో దేశ ప్రజలను ఎందుకు నిర్ణయించుకోనివ్వకూడదని కేటీఆర్ అమిత్ షాను ప్రశ్నించారు. కాంగ్రెస్ సహా శివసేన, డీఎంకే, తృణమూల్ తీవ్రంగా స్పందించాయి. హిందీ మా జాతీయ భాష కానే కాదని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తేల్చి చెప్పారు. డీఎంకే భిన్నమైన స్పందన వ్యక్తం చేసింది. అసలు హిందీకే్ ఇంగ్లిషు ప్రత్యామ్నాయం కావాలని, అన్నిహిందీయేతర రాష్ట్రాలూ హిందీకి ఇంగ్లిషును ప్రత్యామ్నాయం కావాలని కోరుకుంటున్నాయని డీఎంకే తేల్చేసింది.
దక్షిణాదిలో హిందీ వ్యతిరేక ఉద్యమాలు కూడా జరిగాయి. హిందీని బలవంతంగా రుద్దుతున్నారన్న విమర్శలు చాలా కాలంగా ఉన్నాయి. అలాగే తాజా అమిత్ షా ప్రకటనపై దక్షిణాది రాష్ట్రాలే కాదు.. ఇతర రాష్ట్రాలు కూడా ఖండించాయి. ప్రాంతీయ భాషలు, పార్టీల విలువను తగ్గించే అజెండా ఉన్నట్లు అమిత్ షా మాటలు ఉన్నాయని శివసేన ఆరోపిస్తోంది. అమిత్షా ప్రకటన దేశ సమగ్రతకు గొడ్డలిపెట్టులాంటిదని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో సమైక్యతను విచ్ఛిన్నం చేసేందుకు బీజేపీ అధిష్ఠానం ప్రయత్నిస్తోందని విమర్శించారు. భిన్నత్వంలో ఏకత్వం ఉన్న మన దేశంలో అత్యధిక మంది హిందీ మాట్లాడతారు. కానీ ప్రతి రాష్ట్రానికి ఓ భాష ఉంది. ఈ క్రమంలో హిందీని ఒకే భాషగా.. జాతీయ భాషగా మార్చాలనుకుంటున్న కేంద్రానికి ఎప్పుడూ వ్యతిరేకత వస్తునే ఉంది.