ఢిల్లీలో టీఆర్ఎస్ ధర్నా చేయనుంది. వరి పోరులో భాగంగా సోమవారం ధర్నా చేయబోతున్నారు. టీఆర్ఎస్ నేతలు ఏర్పాట్లలో ఎక్కడా తగ్గడం లేదు. పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. ఒక దేశం – ఒకే ధాన్యం సేకరణ పాలసీ అంటూ నినాదంతో బిల్ బోర్డుల్ని కూడా బుక్ చేసి ఫ్లెక్సీల్ని ఏర్పాటు చేస్తున్నారు. తెలుగులో ఒక్కటి కూడా లేదు. అన్నీ హిందీలోనే ఉన్నాయి. ఇటీవలి కాలంలో కేసీఆర్ రాష్ట్రాల పర్యటనలకు వెళ్తే అక్కడ దేశ్ కీ నేత అనే పేరుతో పెద్ద ఎత్తున ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆ తరహాలోనే ఢిల్లీలోనూ తమ ప్రభావం చూపుతున్నారు.
సోమవారం ఢిల్లీలో చేపట్టనున్న ధర్నా కోసం టీఆర్ఎస్ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. జాతీయ రైతు సంఘాల ప్రతినిధులందర్నీ ఆహ్వానించారు. కేసీఆర్ కూడా పాల్గొననున్నారు. తెలంగాణ భవన్లో జరగనున్న ఈ ధర్నా కోసం పదిహేను వందల మంది టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు హాజరు కాబోతున్నారు. ఇప్పటికే సమన్వయం కోసం నియమితులైన అనేక మంది నేతలు ఢిల్లీ చేరుకున్నారు.
జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టిన కేసీఆర్ ఈ ధర్నా ద్వారా ఉత్తరాది రైతుల ఆదరాభిమానాలు పొందేందుకు ప్రయత్నించే అవకాశం ఉంది. ధర్నా వేదికపై నుంచి ఆయన రైతులకు పెద్ద ఎత్తున వరాలు ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు. రైతుల సమస్యలను పరిష్కరించడానికి తన వద్ద ఉన్న విజన్‌ను ఆవిష్కరించే అవకాశం ఉంది. ధర్నా జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాలని టీఆర్ఎస్ నేతలు శ్రమిస్తున్నారు.