కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత ఇప్పుడు తండ్రి వెంటే ఉంటున్నారు. ముఖ్యంగా జాతీయ రాజకీయ వ్యవహారాలను ఆమె సమన్వయం చేస్తున్నారు. వారం రోజులుగా ఢిల్లీలో మకాం వేసిన కేసీఆర్ తదుపరి కార్యాచరణ ఏమిటి.. ఎలా చేయాలన్నదానిపై ప్లాన్ సిద్ధం చేస్తే కవిత అమలు చేస్తున్నారు. కవిత చురుగ్గా ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్లి వస్తున్నారు. సమాజ్ వాదీ నేత అఖిలేశ్‌తో సంప్రదింపుల బాధ్యతను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీసుకున్నారు. చర్చలు జరుపుతున్నారు.
ఇటీవలి కాలంలో వివిధ రాష్ట్రాలు, ఢిల్లీ పర్యటనలో కేసీఆర్‌తోపాటు వెళ్తున్న కవిత గతంలో ఎంపీగా చేసిన అనుభవంతో జాతీయ స్థాయిలో వివిధ పార్టీల నేతలను సమన్వయం చేయడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. కేసీఆర్ ముంబై, ఢిల్లీ, జార్ఖండ్ పర్యటనల్లోనూ కవిత సీఎం వెంటే ఉన్నారు. మరోవైపు కేసీఆర్‌తోపాటు వారం రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసిన కవిత తన బృందంతో కలిసి జాతీయస్థాయి మీడియా సంస్థల అధినేతలు, ఎడిటర్లతో వరుస భేటీలు జరుపుతున్నారు. జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించేందుకు కేసీఆర్ సన్నాహాలు చేసుకుంటున్నారు.
సీనియర్ జర్నలిస్టు సంజయ్ కుమార్ ఝాను రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీ కేంద్రంగా పనిచేసేలా ప్రజాసంబంధాల అధికారిగా నియమించింది. సంజయ్ నియామకం, ఎంపికలో కవిత క్రియాశీలంగా వ్యవహరించారు. కవిత రాష్ట్ర రాజకీయాల్లో ఉంటారని.. మంత్రిగా బాధ్యతలు చేపడతారని ప్రచారం జరిగుతోంది. కానీ ఆమె కేసీఆర్ జాతీయ రాజకీయాల సమన్వయ బాధ్యతలు తీసుకున్నట్లుగా టీఆర్ఎస్ వర్గాలు ఓ నిర్ణయానికి వచ్చాయి.