2019 ఎన్నికల ప్రచారంలో నారా లోకేష్‌పై ఆళ్ల రామకృష్ణారెడ్డిని గెలిపించండి మంత్రిని చేస్తా అంటూ వైఎస్ జగన్ చేసిన ప్రచారం వర్కవుట్ అయింది. ఆళ్ల రామకృష్ణారెడ్డిని మంత్రిని చేస్తారని అక్కడి జనం అనుకున్నారు. కానీ చేయలేదు. ఆళ్ల కూడా ఆశపడ్డారు. లోకేష్‌పైనే గెలిచానని తనకు ప్రాధాన్యం ఇస్తారనుకున్నారు. కానీ ఇవ్వలేదు. రెండో విడతలో చాన్స్ వస్తుందనుకున్నారు. కానీ అలాంటి చాన్స్ కాదు కదా.. కనీసం పరిశీలనకు కూడా పేరును తీసుకోలేదు. దీంతో ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎప్పట్లాగే పొలం గట్ల మీద ఫోటోలు తీసుకుని సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవాల్సిందే. అయితే జగన్ ఇచ్చిన మాట ఇచ్చి మరీ అసలు లెక్కలోకి తీసుకోకపోవడం ఏమిటనేది చర్చనీయాంశం అవుతోంది.
ఈ జాబితాలో ఆళ్ల ఒక్కరే కాదు మరో సీనియర్ నేత ఉన్నారు. ఆయన కూడా గుంటూరు నేత. ఆయనను మరీ దారుణంగా రాజకీయ భవిష్యత్ లేకుండా చేస్తున్నారు జగన్. చిలుకలూరిపేట మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ పార్టీ కోసం చాలా ఖర్చు పెట్టుకుని పని చేస్తే చివరికి డబ్బులు ఎక్కువగా ఉన్నాయని విడదల రజనీకి చాన్సిచ్చారు. ఆమెను గెలిపిస్తే మర్రి రాజశేఖర్‌కు మంత్రి పదవిని ఇస్తానని జగన్ ఎన్నికల ప్రచారంలో చెప్పారు. మర్రి వర్గీయులు కూడా అదే అనుకున్నారు. మూడేళ్ల తర్వాత మర్రికి కనీసం ఎమ్మెల్సీ కూడా ఇవ్వలేదు. పైగా ఇప్పుడు విడదల రజనీని మంత్రిని చేస్తున్నారు. జగన్ ఇంత దారుణంగా మోసం చేస్తారని అనుకోలేదని మర్రి వర్గీయులు మండి పడుతున్నారు.
మంత్రి పదవులు హామీ ఇచ్చిన వారు వీరే కాదు మరికొంత మంది ఉన్నారు. ఆ హమీలు ఇచ్చినట్లుగా కూడా జగన్ గుర్తుంచుకోలేదు. అందరికీ మొండి చేయి చూపించారు. సామాజిక సమీకరణాల పేరుతో మొదటి సారి గెల్చిన వారికి కూడా పదవులు ఇచ్చి.. ఎలాంటి అవకాశాలు ఇతర పార్టీల నుంచి వచ్చినా వెళ్లని తమకు అన్యాయం చేస్తున్నారని వాళ్లంతా గొణుక్కుంటున్నారు. ఇప్పుడు వారికి మరో చాయిస్ కూడా లేదు