వైఎస్ జగన్ మూడేళ్లలో రెండో కేబినెట్ ఏర్పాటు చేశారు. పాత మంత్రులందరితో రాజీనామాలు చేయించి.. మళ్లీ అందులో పదకొండు మందితో మళ్లీ ప్రమాణం చేయిస్తున్నారు. మరో పధ్నాలుగు మంది కొత్త వారికి చాన్సిస్తున్నారు. మంత్రి పదవులు ఇవ్వడానికి ప్రతిభను ప్రామాణికంగా తీసుకోలేదని కేవలం కులాన్ని తీసుకున్నామని ఈ మొత్తం వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన సజ్జల రామకృష్ణారెడ్డి నిర్మోహమాటంగా ప్రకటించారు. కులమే బలమని ఆయన చెప్పకనే చెప్పేశారు.
కులాలకు కేబినెట్ బెర్తులిస్తే సరిపోతుందా !?
దళిత వర్గాలు, బీసీలకు మంత్రి పదవులు ఒక్కోటి చొప్పున పెంచామని.. ఇది సామాజిక మహా విప్లవం అని వైఎస్ఆర్సీపీ పెద్దలు చెబుతున్నారు. గతంలో ఉన్న వాటికి ఒక్కో మంత్రి పదవి పెరిగినంత మాత్రాన సామాజిక మహా విప్లవం ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు కానీ.. ఇప్పటి వరకూ ఆయా వర్గాల అభ్యున్నతికి ఏం చేశారు ? వారి ఆర్థికాభివృద్ధికి ఎలాంటి చేయూత అందించారు ? లాంటివి కూడా చెప్పుకుంటే బాగుంటుంది. కార్పొరేషన్లు పెట్టి.. ఆ పేరుతో పథకాల డబ్బులను చూపించడం కాకుండా.. ఆయా వర్గాల ఉపాధికి ఎంత మేర లోన్లు ఇచ్చారో చెప్పాల్సింది. పేరుకు మాత్రమే ఉండి… నిధులు, విధుల్లేని పోస్టులు కాకుండా.. కనీసం తమ వర్గానికి మేలు చేసే పదవులు ఆయా వర్గాలకు ఎన్నిచ్చారో చెప్పాల్సింది. కానీ కొంత మందిని తీసేసి.. కొంత మందికి పదవులిచ్చి విప్లవం అని చెప్పుకుంటే కామెడీ అయిపోదా?
రెడ్డి సామాజికవర్గానికి తగ్గించలేదేం !?
అగ్రవర్ణాలతో పాటు కాపులకూ మంత్రి పదవుల్లో కోత విధించారు. రెడ్డి సామాజికవర్గానికి మాత్రం ఒక్కటీతగ్గించలేదు. ఇంకా చెప్పాలంటే ఓ పదవి పెంచారు. సీఎం జగన్‌తో కలిపి నేరుగా ఐదుగురు రెడ్డి మంత్రులు ఉన్నారు. కానీ బీసీ కోటాలో మంత్రి పదవి పొందిన ఓ మహిళ భర్త రెడ్డి సామాజికవర్గం. ఆ లెక్కన చూస్తే మరో సీటు ఆ వర్గానికి పెంచినట్లయింది కానీ తగ్గించలేదు. కుటుంబంలో ఉన్న వివాదాల కారణంగా బాలినేనిని తప్పించారన్న ప్రచారం జరుగుతోంది.
ఆ వర్గాలు ఓట్లేయరని డిసైడయి పదవులు దండగనుకున్నారా !?
వైశ్య, క్షత్రియ, కమ్మ, బ్రాహ్మణ వర్గాలకు కేబినెట్లో చోటు దక్కలేదు. ఇందులో వైశ్య సామాజికవర్గానికి ప్రతీ సారి ఓ బెర్త్ ఖాయంగా ఉంటూ వస్తోంది. టీడీపీ హయంలో శిద్దా రాఘవరావు ఉన్నారు. ఇటీవలి వరకూ వెల్లంపల్లి ఉన్నారు. అయినా అసలు ఈ సారి వారికి మంత్రి పదవి అవసరం లేదని పక్కన బెట్టారు. వైశ్య సామాజికవర్గంపై ఏపీలో ఇటీవల విపరీతంగా దాడులు జరుగుతున్నాయన్న అసంతృప్తి వారిలో ఉంది. రోశయ్య విషయంలో జగన్ అనుసరించిన తీరు కూడా వివాదాస్పదమయింది. ఇప్పుడు మంత్రి పదవినీ తొలగించడం ఆ వర్గంలో అసంతృప్తికి కారణం అవుతోంది. ఇక రఘురామరాజు ఇష్యూతో ఆ వర్గం ఎవరూ ఓట్లేయని డిసైడయినట్లుగా ఉన్నారు. ఇక బ్రాహ్మణులకు ఏ మేలూ జరగడం లేదు. ఇక కమ్మ సామాజికవర్గంలో అరవై శాతం టీడీపీ ఓటు బ్యాంక్‌గా ఉంటారు. మిగిలిన వారు కూడా వేయరని పక్కన పెట్టేసినట్లుగా ఉన్నారు. మొత్తంగా పక్కన పెట్టిన సామాజికవర్గాల ఓట్లు తమకు అవసరం లేదని డిసైడయ్యారు.
అన్యాయం జరిగింది !
కేబినెట్లో సామాజిక న్యాయం జరగలేదు. అన్యాయం జరిగింది. కొన్ని వర్గాలపై వ్యతిరేకత పెంచేలా.. మరి కొన్నివర్గాలపై అభిమానం చూపుతున్నట్లుగా కనిపించడం కోసం ఓ రకమైన పొలిటికల్ గేమ్ ఆడుతున్నారు. ఇది అంతిమంగా నష్టమే చేస్తుంది. ఎందుకంటే కేబినెట్లో ఎంత మంత్రి తమ వర్గం మంత్రులున్నారని లెక్కలేసుకుని ఎవరూ ఓటింగ్ చేయలేరు. ప్రభుత్వ పనితీరే ఎప్పటికైనా ప్రధమ ప్రాధాన్యత అవుతుంది. కానీ ప్రభుత్వం మాత్రం కులమే బలం అనుకుంటోంది.