వైసీపీలో ఇక చాన్సులు ఉండవని… డిసైడైపోతున్న వైసీపీ నేతలు ప్రత్యామ్నాయంగా షర్మిల నాయకత్వం వైపు చూస్తున్నారన్న ప్రచారం ఊపందుకుంటోంది. బాలినేని శ్రీనివాసరెడ్డి ..,సీఎం జగన్ తల్లి తరపు బంధువు. ఇటీవలి కాలంలో జగన్కు తల్లితో కూడా సంబంధాలు తెగిపోయాయి. ఈ క్రమంలో బాలినేనిని కూడా తొలగించడం వివాదాస్పదమవుతోంది. ఆయన పాదయాత్ర ప్రారంభించిన షర్మిలతో ఓ సారి భేటీ అయ్యారు. ఇప్పుడు మరోసారి కొంత మంది ఎమ్మెల్యేలతో కలిసి భేటీ అవ్వాలని నిర్ణయించుకున్నట్లుగా చెబుతున్నారు.
ఏపీలో పార్టీ పెడతానని బీసీలకే ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటిస్తాని షర్మిల భర్త బ్రదర్ అనిల్ ప్రకటించారు. ఈ క్రమంలో ప్రభుత్వం అనూహ్యంగా బీసీల జపం ప్రారంభించింది. మరొకరికి అదనంగా మంత్రి పదవులు ఇచ్చింది. దీనికి బ్రదర్ అనిల్ పెడతానన్న పార్టీ కారణమా.. లేకపోతే.. దూరమైన కొన్ని వర్గాలకు బదులుగా ఇతర వర్గాలను దగ్గర చేసుకోవాలనుకుంటున్నారా అన్న విషయం పక్కన పెడితే.. ఇప్పుడు కొంత మంది వైసీపీ నేతలు షర్మిల పార్టీ వైపుచూడటం అనూహ్యమే.
ఎక్కువ మంది వచ్చి… వైఎస్ రాజశేఖర్ రెడ్డి నాయకత్వాన్ని షర్మిల చేపట్టాలని.. ఆమె నిజమైన వారుసరాలని..ఏపీలోనూ అడుగు పెట్టాలని ఒత్తిడి చేస్తే షర్మిల కూడా అంగీకరించే అవకాశం ఉంది. ఎందుకంటే తెలంగాణలో పాదయాత్ర చేస్తున్న ఆమెకు కనీస స్పందన లేదు. ఎంత ఖర్చుపెట్టుకుంటున్నా ప్రయోజనం లేదు. గతంలో మీడియా ఎంతో కొంత కవరేజీ ఇచ్చేది. ఇప్పుడు అసలు ఇవ్వడం లేదు. అదే ఏపీలో ఆమె రాజకీయం చేస్తే ఏం చేసినా కవరేజీ వస్తుంది.
ఇప్పుడు షర్మిలకు ఏపీలోని మరో గ్రౌండ్ ఏర్పడుతోంది. ఎంత మంది అసంతృప్తులు షర్మిల వద్దకు వెళ్తారన్నది ఇప్పుడు కీలకం.