దేశ్ కీ నేత అని అనిపిచుకునే ప్రయత్నాల్లో కేసీఆర్ మొదటి ప్రయత్నం చేస్తున్నారు. ఢిల్లీ స్థాయిలో రైతుల కోసం దీక్ష చేస్తున్నారు. కేసీఆర్ ఒక్క తెలంగాణ రైతుల కోసం కాదని… దేశవ్యాప్తంగా ఉన్న రైతుల కోసం దీక్షలు చేస్తున్నారన్న ఇమేజ్ కోసం ఇప్పటికే గ్రౌండ్ ప్రిపేర్ చేశారు. సొంత పీఆర్వోను నియమించారు. హిందీ మీడియాకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. దక్షిణాది నేతలకు జాతీయ మీడియా అంటే ఇంగ్లిష్ మీడియా మాత్రమే. ఇక్కడ జనం అంతో ఇంతో చూసేది ఇంగ్లిష్ మీడియానే. కానీ ఉత్తరాది జనం మాత్రం హిందీ మీడియానే చూస్తారు. అందులో కవరేజీ వస్తే కేసీఆర్కు గుర్తింపు వస్తుంది.
ఇప్పటి వరకూ తెలంగాణ సీఎం కేసీఆర్ అనే గుర్తింపు మాత్రమే ఉంది. ఆయనను అలాగే ఉత్తరాది ప్రజలు గుర్తిస్తారు. కానీ కేసీఆర్ రైతు ఉద్యమకారుడిగా… గుర్తించబడాలనుకుంటున్నారు. వారి కోసం తాను జాతీయ రాజకీయాల్లోకి వస్తున్నానని.. తాను తెలంగాణకే పరిమితమైన నేతను కాదని వారికి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు. దానికి తెలంగాణ భవన్ దీక్ష లో ప్రయత్నించే అవకాశం ఉంది. సోమవారం కేసీఆర్ చేయబోయే దీక్షలో హిందీ స్పీచ్ హైలెట్ అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.
కేసీఆర్ వడ్ల పోరులో బీజేపీని టార్గెట్ చేసినా అది కేవలం తెలంగాణకు సంబంధించినంత వరకూ కాదని.. దేశం మొత్తం రైతాంగాన్ని ఏకతాటిపైకి తేవడానికి చేస్తున్న ప్రయత్నమని చెబుతున్నారు. అందుకే బీజేపీ ఎక్కువగా చెప్పే వన్ నేషన్ – వన్ పాలసీ విధానంలోనే వన్ నేషన్ – వన్ పాడి ప్రొక్యూర్మెంట్ పాలసీ నినాదాన్ని ప్రచారంలోకి తెచ్చారు. కేసీఆర్ ప్రయత్నం సక్సెస్ అయి రైతుల్లో మంచి ఇమేజ్ తెచ్చుకుంటే ఆయనకు అక్కడ కూడా నేతగా గుర్తింపు వస్తే… కేసీఆర్ రాజకీయం మరోలా ఉండే అవకాశం ఉంది.