తెలంగాణకు కేంద్ర దర్యాప్తు బృందాలు వచ్చేశాయని.. ఇక దాడులు చేయబోతున్నారన్న ప్రచారం ఊపందుకుంది. దాడులు చేసే వరకూ ఈ విషయంపై స్పష్టత ఉండదు. నేరుగా టీఆర్ఎస్ను కానీ ఆ పార్టీ నేతల్ని కానీ టార్గెట్ చేయరని.. కేవలం వారికి ఆర్థిక ఆయువు పట్టుగా ఉన్న మార్గాలపైనే దృష్టి పెడతారని చెబుతున్నారు. దీని వల్ల టీఆర్ఎస్ నేతలు కూడా కిక్కురుమనే పరిస్థితి ఉండదని చెబుతున్నారు. బీజేపీ రాజకీయంలో దర్యాప్తు సంస్థలది ప్రత్యేకమైన పాత్ర. అందుకే వాటిని బీజేపీ మిత్రపక్షాలని కాంగ్రెస్.. ఇతర పార్టీలు విమర్శిస్తూ ఉంటాయి. అయితే అవి వేధింపులా కాదా అన్న విషయం పక్కన పెడితే.. రాజకీయంగా ఆయా పార్టీల వారిని చికాకు పెట్టడం ఖాయం.
గతంలో బీజేపీతో టీడీపీ తెగదెంపులు చేసుకున్న తర్వాత కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎలా హడావుడి చేశాయో ప్రత్యేకంగా చూశాం. చిన్నా పెద్ద టీడీపీ నేతలందరిపైనా వరుసగా దాడులు జరిగాయి. ప్రతీ ఖాతాను పట్టి పట్టి పరిశీలించారు. చివరికి సీబీఐ కూడా వస్తుందేమో అన్న ఉద్దేశంతో సీబీఐకి ఇచ్చిన జనరల్ కన్సెంట్ను చంద్రబాబు రద్దు చేశారు. అప్పట్లో దర్యాప్తు సంస్థల ప్రతినిధులు పదుల సంఖ్యలో అలా కార్లలో బయలుదేరేవారు. ఎక్కడికి వెళ్లేవారో ఎవరికీ తెలిసేది కాదు. అంత టెన్షన్ పడేవారుటీడీపీ నేతలు.
ఇప్పుడు అలాంటి పరిస్థితి టీఆర్ఎస్ నేతలకు వస్తుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. టీఆర్ఎస్ నేతలతో సన్నిహిత సంబంధాలు ఉండి… కాళేశ్వరం వంటి ప్రాజెక్టుల్లో సబ్ కాంట్రాక్టులు చేస్తున్న కంపెనీలపై ఇప్పటికే దాడులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఈ సారి మరింతగా టార్గెట్ చేసేందుకు ప్రయత్నిస్తున్న ప్రచారం జరగడం.. టీఆర్ఎస్కు ఇబ్బందికరమే.