ఇటీవల దేశమంతా తీవ్ర చర్చకు తావిచ్చిన చిత్రం కశ్మీరీ ఫైల్స్. 1990 కశ్మీరీ పండిట్స్ ఊచకోతల నేపథ్యంలో సాగే కథ ఇది. చిన్న సినిమాగా విడుదలై… భారీ వసూళ్లు సాధించింది. దాదాపు రూ.250 కోట్లు వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ సినిమాని నరేంద్రమోడీ కూడా మెచ్చుకోవడంతో మరింత పబ్లిసిటీ వచ్చింది. ఈ సినిమా బిజేపీ సమీకరణాల్లో తీశారు అని చాలామంది విమర్శించారు కూడా. అయితే… అవేం బాక్సాఫీసు దగ్గర భారీ విజయాన్ని అడ్డుకోలేకపోయాయి. ఇప్పుడు ఈ టీమ్ నుంచి మరో రెండు సినిమాలు రాబోతున్నాయి. రెండూ వివాదాస్పద కథలే.
అభిషేక్ అగర్వాల్ నిర్మాతగా, వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో కశ్మీరీ ఫైల్స్ వచ్చింది. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో మరో రెండు చిత్రాలు రాబోతున్నాయి. ఈ విషయాన్ని అభిషేక్ అగర్వాల్ ప్రకటించారు. ఎలాగైతే కశ్మీరీ ఫైల్స్.. యదార్థ ఘటనల్ని, చరిత్రనీ కళ్లముందు ఉంచిందో… అలానే రాబోయే సినిమాలు సైతం చరిత్రని తెరపై చూపిస్తాయని అభిషేక్ అగర్వాల్ ప్రకటించారు. అంటే.. ఇవి కూడా కాంట్రవర్సీ కథలే అన్నమాట. ఈ కథల్లో కూడా రాజకీయ నాయకులు, పార్టీలు, ప్రజలతో, వాళ్ల సెంటిమెంట్స్ తో ఎలా ఆడుకుంటాయో చూపించే ప్రయత్నం జరగబోతోందన్నది ఇన్ సైడ్ వర్గాల టాక్. కశ్మీరీ ఫైల్స్‌కి అనూహ్య స్పందన వచ్చిన నేపథ్యంలో.. ఈ చిత్రాలపై కూడా బాక్సాఫీస్ గట్టిగానే దృష్టిసారించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కశ్మీరీ ఫైల్స్ పై బీజేపీ ముద్ర పడినట్టే… ఈ సినిమాలన్నీ జనాలు అలానే చూస్తారా? అలాంటి చర్చకే తావిస్తాయా? అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.