దక్షిణాది సినిమా వెలుగుతోంది. నార్త్‌లో ప్రభంజనం సృష్టిస్తోంది. ఎంతగా అంటే… సౌత్ సినిమా చూసి బాలీవుడ్డే భయపడేంతగా. దీనంతటికీ కారణం.. రాజమౌళి, ప్రశాంత్ నీల్ లే. బాహుబలితో రాజమౌళి ఓ బాట వేస్తే… కేజీఎఫ్‌తో ప్రశాంత్ నీల్. దాన్ని హైవేగా మార్చేశాడు. మొన్నటికి మొన్న ఆర్.ఆర్.ఆర్…. బాలీవుడ్ లోనూ విజయ ఢంకా మోగించింది. ఇప్పుడు కేజీఎఫ్ 2 వంతు వచ్చింది. మరి కొద్ది గంటల్లో కేజీఎఫ్ బొమ్మ పడిపోతోంది. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. అన్నీ కుదిరితే… తొలి రోజు వసూళ్లలో.. కేజీఎఫ్ కొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని… ట్రేడ్ వర్గాలు జోస్యం చెబుతున్నాయి. అయితే… సౌత్ సినిమా ఈ స్థాయిలో విజృంభించడానికి కారకుడు, మార్గ దర్శకుడు రాజమౌళినే అంటూ క్రెడిట్ మొత్తం జక్కన్నకు ఇచ్చేశాడు ప్రశాంత్ నీల్.
కేజీఎఫ్ 2 ప్రీ రిలీజ్ వేడుకలో… ప్రశాంత్ నీల్ మాట్లాడాడు. ”చిన్న గల్లీ లాంటి పాన్ ఇండియా సినిమాని.. ఎనిమిది రోడ్ల హైవేగా మార్చేశారు రాజమౌళి. ఆయన డైరెక్టర్ కాదు.. కాంట్రాక్టర్… దక్షిణాది సినిమాకి ఇంత గుర్తింపు వచ్చిందంటే ఆయనే కారణం. ఆయనే అతి పెద్ద స్ఫూర్తి” అంటూ కితాబు ఇచ్చాడు. కేజీఎఫ్‌లో పెద్దగా స్టార్లు లేరు. కానీ… పార్ట్ 2లో మాత్రం సంజయ్ దత్, రవీనా టాంటడన్, ప్రకాష్ రాజ్, రావు రమేష్ లాంటి వాళ్లని నింపేశాడు. దీనిపై కూడా ప్రశాంత్ నీల్ స్పందించాడు. “వాళ్లు స్టార్లే కావొచ్చు. కానీ… నాకు మాత్రం పాత్రలు. పాత్రలకు అనుగుణంగానే వాళ్లని ఎంచుకున్నా“ అంటూ వాళ్ల ఎంపికకు గల కారణాన్ని విశదీకరించాడు ప్రశాంత్.