హైదరాబాద్: జగన్ నాయకత్వంలోనే కొనసాగుతామని, ఆయనను వదిలేది లేదని బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి చెప్పారు. టీడీపీలోకి వెళుతున్నామంటూ ఎల్లో మీడియా సంస్థలు అసత్య ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. మునిగిపోయే నావలాంటి టీడీపీలోకి ఎవరూ వెళ్ళరని, చంద్రబాబుకు బుద్ధి చెప్పటం ఖాయమని అన్నారు. కోన, ముస్తఫా ఇవాళ లోటస్ పాండ్‌లో జగన్‌ను కలిశారు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ చీప్ పాలిటిక్స్‌కు లొంగబోమని చెప్పారు. కూరగాయల బేరంలాగా రకరకాల ఆఫర్లు ఇస్తున్నారని, ఫలానా వ్యక్తి ఫోన్ చేశారని చెప్పటం సంస్కారం కాదని అన్నారు. బ్రాహ్మణ సామాజికవర్గానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నో హామీలు ఇచ్చారని, వాటన్నిటినీ తాను ప్రభుత్వానికి గుర్తు చేస్తూనే ఉంటానని కోన చెప్పారు. వైసీపీ సింబల్పైన గెలిచిన తాము ప్రతిపక్షంగా ప్రభుత్వంపై పోరాడతామని అన్నారు. టీడీపీలో చేరబోతున్నట్లు బాగా ప్రచారం జరిగిన నేపథ్యంలో కోన రఘుపతి, ముస్తఫా ఈ వివరణ ఇచ్చినట్లు కనబడుతోంది.