ఎవరి మీద అయినా కోపం వస్తే తీర్చుకోవడానికి బండ్ల గణేష్‌కు ట్విట్టర్ ఉంది. ఆ ట్విట్టర్ అకౌంట్‌నే ఆయుధంగా చేసుకుని .. తన వ్యతిరేకులపై దాడి చేస్తూంటారు. గతంలో చాలా మందిపై ఆలా ట్వీట్ వార్ కు దిగారు. ఇప్పుడు ఆయన దృష్టి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై పడింది. ఆయనపై వరుస ట్వీట్లు చేసి తిట్ల దండకం వినిపించారు. ” వైజాగ్ ని కుదిపేసిన తూఫాన్ నయం నీ కన్నా. రెండు రోజులు ఊపేసి పోయింది. దేశం గర్వించే సిటీని నీ పాపాలతో అయ్యో పాపం విశాఖ చేసావ్ విష సాయి అంటూ విరుచుకుపడ్డారు. అంతే కాదు షర్మిల జగన్‌తో విభేదించడానికి కూడా కారణం విజయసాయిరెడ్డేనన్నట్లుగా మరో ట్వీట్ చేశారు.
మొత్తంగా బండ్ల గణేష్ ట్వీట్ వైసీపీని టార్గెట్ చేయలేదు. ఒక్క విజయసాయిరెడ్డినే టార్గెట్ చేశారు. సీఎం జగన్‌ను విజయసాయిరెడ్డి తప్పుదోవ పట్టిస్తున్నారన్నట్లుగా మాట్లాడారు. హఠాత్తుగా బండ్ల గణేష్ ఎందుకిలా చేశారో సినీ ఇండస్ట్రీ వర్గాలకు కూడా ఆసక్తికరంగా మారింది. ప్రత్యేకంగా విశాఖ గురించి ప్రస్తావించారంటే అక్కడ బండ్ల ఏదైనా లావాదేవీలు చేయాలనుకుంటే… విజయసాయిరెడ్డి కారణంగా తేడా వచ్చిందేమోనన్న అభిప్రాయం చాలా మందిలో కలుగుతోంది. అదే సమయంలో రాజకీయంగా టార్గెట్ చేయలేదన్న విషయం సులువుగా అర్థం చేసుకోవచ్చు.
విజయసాయిరెడ్డి … బండ్ల గణేష్ కు సంబంధించిన వ్యవహాల్లో జోక్యం చేసుకోవడమో.. లేకపోతే విశాఖలో ఏదైనా భూ లావాదేవీల్లో తేడా రావడమో జరిగి ఉంటుందని చెబుతున్నారు. అయితే ఇక్కడ బండ్ల గణేష్ కుల ప్రస్తావన కూడాతీసుకు వచ్చారు. విజయసాయిరెడ్డి ఓ కులాన్ని నిందిస్తున్నారని.. తాను ఆ కులానికి చెందిన వాడ్ని కాబట్టి స్పందిస్తున్నానని చెప్పుకొచ్చారు. కానీ విజయసాయిరెడ్డి కానీ.. వైసీపీ కానీ.. ఓ కులాన్ని నిందించడం ఇదే మొదటి సారి కాదు . మరి బండ్లకు ఎందుకు ఆవేశం వచ్చింది ? దాని వెనుక ఏం ఉంది అన్నది ఆయన బయటపెడితేనే తెలియాల్సి ఉంది.