నెల్లూరు వైఎస్ఆర్సీపీలో ఆదివారం రచ్చ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. మంత్రిగా పదవీ ప్రమాణం చేసిన తరవాత కాకాణి గోవర్ధన్ రెడ్డి మొదటి సారి నెల్లూరు ఆదివారం వస్తున్నారు. ఆయన ఇన్ని రోజులు విజయవాడలో ఉండటానికి కారణం .. మంత్రిగా తన జిల్లా ఎంట్రీ అద్దిరిపోయే రేంజ్లో ఉండాలని కోరుకోవడమే. తన స్వాగత ఏర్పాట్లు అత్యంత భారీగా ఉండేలా ఇప్పటికే ఏర్పాట్లు చేసుకున్నారు.అయితే ఆయనకు సొంత పార్టీలోని ఇతర వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
గతంలో కాకాణి గోవర్ధన్ రెడ్డి ఎవరితోనూ సత్సంబంధాలు కొనసాగించిన సందర్భం లేకపోవడంతో ఆయనకు వ్యతిరేమయినవారు ఎక్కువగా ఉన్నారు. మాజీమంత్రి అనిల్ కూడా అందులో ఒకరు. ఆయనకు చెక్ పెట్టేందుకు పోటీ సభ నిర్వహించాలని నిర్ణయించారు. కాకాణి కంటే తనకే ఎక్కువ బలం ఉందని అనిల్ నిరూపించాలనుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. ఆయన సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
ఎవరికీ పోటీ సభ కాదని మూడు రోజుల ముందే సభకు అనుమతి కోసం దరఖాస్తు చేశానన్నారు. సమావేశం వాయిదా వేసుకోవాలని అధిష్టానం సూచించలేదని చెప్పారు. ఎవరో కార్యక్రమం పెట్టారని తాము సభను వాయిదా వేసుకోలేమని కాకాణి ర్యాలీ గురించి ప్రస్తావించారు. వైసీపీ నేతల పోటాపోటీ రాజకీయాలతో ఆదివారం నెల్లూరులో రాజకీయాలు వేడెక్కే అవకాశం ఉంది.